పీవీపీ కంప్లైంట్.. ప్రస్తుతం పరారీలో బండ్ల గణేశ్

February 24, 2020

సినీ రంగంలో కొందరికి ఉండే ఇమేజ్  కాస్త భిన్నంగా ఉంటుంది. అలాంటి కోవలోకే వస్తారు నిర్మాత.. నటుడు.. కమ్ అప్పడప్పుడు రాజకీయాల్లో దర్శనమిచ్చే బండ్ల గణేశ్. తాజాగా ఆయనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రముఖ నిర్మాత పీవీపీ ఇచ్చిన మౌఖిక ఫిర్యాదుతో బండ్ల గణేశ్ మీద పోలీసులు కేసు నమోదు చేయటం గమనార్హం.
ఇంతకీ.. వీరి మధ్య వివాదం ఏమంటే.. టెంపర్ సినిమాకు సంబంధించి సినీ ఫైనాన్షియర్.. సహ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ బండ్ల గణేశ్ కు రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టారు. సినిమా రిలీజ్ వేళ.. అసలు మొత్తాన్ని చెల్లించి.. వడ్డీ ఇతరాలకు సంబంధించిన మొత్తానికి బండ్ల గణేశ్ చెక్కు ఇచ్చారు.
అయితే.. దీనికి సంబంధించిన వ్యవహారం ఇరు వర్గాల మధ్య వివాదంగా మారింది. తాజాగా గణేశ్ కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు పీవీపీ ఇంటికి వెళ్లి.. ఆయన్ను బెదిరించారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫోన్ చేసిన పీవీపీ.. తనను బండ్ల గణేశ్ కు చెందిన వ్యక్తులు బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బండ్ల గణేశ్ ను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించారు.
అయితే.. పోలీసులకు గణేశ్ అందుబాటులోకి రాకపోవటంతో.. ఆయన పరారీలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఇక.. బండ్ల గణేశ్ అనుచరులుగా భావిస్తున్న వారిపై ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బండ్ల గణేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇరువురుసినీ రంగానికి చెందిన వారు బెదిరింపుల వరకూ వెళ్లటం.. కేసుల దాకా తెచ్చుకోవటంపై హాట్ చర్చ సాగుతోంది.