ఇండియాకు వచ్చి మోడీపై సెటైర్లు వేసిన బంగ్లా ప్రధాని

May 29, 2020

మోడీ సమస్యలు పరిష్కరించే విధాన జిందా తిలిస్మాత్ వాడమన్నట్టే ఉంటుంది. ఉల్లి ధరలు భగ్గమనకుండా ముందు జాగ్రత్త చర్యలు ఉండవు. అమాంతం పెరిగినపుడు మాత్రం ఠక్కున ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకుంటారు. అప్పటికది పరిష్కారం అయినా... ఆ విధానం దేశానికి మంచిది కాదు. తాజాగా ఇండియాలో జరుగుతున్న ఎకనమిక్ సదస్సుకు హాజరైన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మాటలు ఇక్కడ ప్రస్తావనార్హం.

’ఉల్లి ఎగుమతులను భారత్ నిషేధించింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటపుడు మాకు కాస్త సమాచారం ఇస్తే బాగుంటుంది. ముందే ఎక్కువ కొనుక్కుని ఇంట్లో పెట్టుకునేవాళ్లం. ఇపుడు ఏం చేయాలో తెలియక మా వంట మనిషికి... ఉల్లిపాయలు అవసరం లేని కూరలు చేయమని చెప్పాను‘ అంటూ బంగ్ల ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యానించారు. ఆమె మన గడ్డపై ఉంది కాబట్టి చలోక్తిగా చెప్పారు. ఇదే ఆమె సొంత గడ్డపై ఇంత సున్నితంగా చెప్పరు కదా.

ఇది పక్కన పెడితే ఈ విధానం మంచిది కాదు. మనం ఉల్లి ఎగుమతి చేస్తాం కాబట్టి ఉల్లిని ఆపేస్తాం. అలాగే పెట్రోలు తయారుచేసే దేశం వాడు ఠక్కున పెట్రో ఎగమతులను ఆపేస్తే ఏంటి పరిస్థితి. అందుకే దేశానికి, పాలకులకు ప్లానింగ్ అవసరం. ముందు జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇలాంటి అర్ధంతర ఎమెర్జన్సీ సమస్యలకు ఎమర్జెన్సీ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. భవిష్యత్తులో మన ఎమర్జెన్సీల గురించి ఇతర దేశాలు ఇలాగేచేస్తే కష్టం కదా.