కుక్కల్ని తెచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే..

August 03, 2020

అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది భారత యువ జట్టు. కానీ టోర్నీ ఆరంభం నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తూ వచ్చిన మన జట్టు.. ఫైనల్లో బోల్తా కొట్టేసింది. కట్టుదిట్టంగా సాగిన బంగ్లా బౌలింగ్ ధాటికి మనోళ్లు 177 పరుగులకే చాప చుట్టేశారు. ఆ తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఎంత పోరాడినా ఫలితం లేకపోయింది. బంగ్లా దేశ్ ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టఫ్ లక్ అనుకుని మన కుర్రాళ్లు ఊరుకున్నారు.

ఐతే ఓటమి బాధలో ఉన్న వాళ్లతో క్రీడా స్ఫూర్తితో వ్యవహరించాలన్న జ్ఞానం బంగ్లా కుర్రాళ్లకు లేకపోయింది. గెలిచిన జట్టు హుందాతనం మరిచింది. ప్రత్యర్థి జట్టును ఎగతాళి చేస్తూ విశృంఖలంగా సంబరాలు చేసుకున్నారు. ఎగెరిగిరి పడ్డారు. దీంతో మన కుర్రాళ్లకు మండింది. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.

దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అసలు ఈ మ్యాచ్ ఆరంభం నుంచి బంగ్లా కుర్రాళ్ల ప్రవర్తన ఏమీ బాగా లేదు. భారత బ్యాటింగ్ సాగుతున్నపుడు బంగ్లా ప్రధాన బౌలర్ షోరిఫుల్ ప్రతి బంతికీ అతి చేశాడు. బంతి వేసిన ప్రతిసారీ బ్యాట్స్‌మన్‌ను తిట్టడం.. కవ్వించడం చేశాడు. ఇలా ఎప్పుడో ఒకసారి చేస్తే ఓకే కానీ.. ప్రతి బంతికీ స్లెడ్జింగ్ చేయడాన్ని ఏమనాలి? ఇక మ్యాచ్ తర్వాత ఈ షోరిఫుల్, మిగతా వాళ్లు చేసిన అతి అంతా ఇంతా కాదు. ఇదంతా బంగ్లా సీనియర్ జట్టు నుంచి వచ్చిన సంస్కృతి. వాళ్లు కూడా భారత్‌తో కొన్ని మ్యాచ్‌ల్లో ఇలాగే అతి చేశారు. మనమేదో చిరకాల ప్రత్యర్థులైనట్లు బంగ్లా జట్టు చేసే అతి టూమచ్. ఐతే వాళ్లకు దిమ్మదిరిగేలా ఎన్నోసార్లు చిత్తుగా ఓడించింది టీమ్ ఇండియా. ఇప్పుడు ఈ కుర్రాళ్లు అతి చేశారు. వీరి తీరు చూశాక కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఎలా ఉంటందో.. వీళ్లకు ప్రపంచకప్ ఇస్తే అలాగే ఉందంటూ మన నెటిజన్లు కామెంట్లు పెడుతుండటం విశేషం.