బిగ్ బాస్ 3... కుదిర్చిన పెళ్లి సంబంధం అవుతుందా?

August 07, 2020

తెలుగు బిగ్ బాస్-3 షోలో రాహుల్, పునర్నవిల మధ్య ప్రేమ పుట్టిందని ఇంటాబయటా అంతా కోడై కూశారు. వారు కూడా దాన్నేమీ ఖండించలేదు. అయితే.. కన్నడ బిగ్ బాస్ హౌస్‌లోనూ అచ్చంగా ఓ జంట ఇలాగే ప్రేమించుకుంది. వారిప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని నిశ్చితార్థం చేసుకున్నారు. దీంతో తెలుగు బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమ జంట రాహుల్, పునర్నవి కూడా బిగ్ బాస్ తరువాత పెళ్లి చేసుకుంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కన్నడ ర్యాపర్ స్టార్ చందన్, నటి నివేదితా గౌడ్ లు బిగ్ బాస్ కన్నడ సీజన్ -6లో పాల్గొన్నారు. అక్కడ వారిద్దరూ మంచి స్నేహితులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుమించి వారి మధ్య ప్రేమ చిగురించింది. తమ ప్రేమ గురించి ఇటీవలి దసరా ఉత్సవాల సందర్భంగా మైసూరులో ఓ వేదికపై తమ వివాహాన్ని వీరు ప్రకటించారు. దసరా ఉత్సవాల వేదికపై పెళ్లి ప్రకటన ఏంటని విమర్శలు రాగా, క్షమాపణలు కూడా చెప్పారు.
తాజాగా నిన్న చందన్, నివేదితల నిశ్చితార్థం బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటిస్తామని, అభిమానుల సమక్షంలో తమ వివాహం జరుగుతుందని ఈ సందర్భంగా వారిద్దరూ తెలిపారు.
కాగా తెలుగు బిగ్ బాస్ ప్రేమ జంట రాహుల్, పునర్నవిలది కూడా ఇంచుమించు ఇలాంటి కథే. రాహుల్ సింగర్ కాగా, పునర్నవి నటి. వీరిద్దరూ బిగ్ బాస్ సీజన్ 3లో మంచి స్నేహితులుగా మెలిగారు. ఇద్దరి మధ్యా ప్రేమ ఉందంటూ హౌస్ మేట్స్, హోస్ట్ నాగార్జున కూడా పలుమార్లు ఇండైరెక్టుగా ప్రస్తావించగా.. ఆ కామెంట్లను వారిద్దరూ ఎంజాయ్ చేశారే కానీ ఖండించలేదు.