ఇటు అమ‌రావ‌తి అటు బీసీలు...జ‌గ‌న్ భలే బుక్క‌య్యాడుగా

June 06, 2020

మూడు రాజ‌ధానుల ఏర్పాటు విష‌యంలో ముందుకు సాగుతున్న ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఈ క్ర‌మంలో ఎదుర‌య్యే ఆందోళ‌న‌ల‌ను ఎంత‌మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే, ఆయ‌న మాట‌ల‌కు చేత‌ల‌కు మ‌ధ్య పొంతన ఉండ‌టం లేద‌నే విష‌యం తాజాగా నిరూప‌ణ అయింది. ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన టీడీపీ ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసింది. తనపంతం నెగ్గించుకోవడానికి రాజధాని విషయంలో రూ.5కోట్లిచ్చి లాయర్‌ను పెట్టిన జగన్, బీసీల రిజర్వేషన్ల పై హైకోర్టులో వాదనలకోసం నిష్ణాణుతుడైన న్యాయవాదిని ఎందుకు నియమించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.
రాష్ట్రప్రభుత్వం బీసీలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియలో ఆయా వర్గాలకు అన్యాయం చేయడానికి జగన్ సర్కారు ప్రయత్నిస్తోందని టీడీపీనేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఎమ్మెల్సీ బచ్చు అర్జునుడితో కలిసి విలేకరులతో మాట్లాడారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థానిక సంస్థల్లో బీసీలకు 25శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, నేడున్న వైసీపీప్రభుత్వం కావాలనే ఆ మొత్తాన్ని తగ్గించడా నికి ‍యత్నిస్తోందన్నారు. 59శాతం వరకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన జగన్, నేడు కావాలనే తనపార్టీ వారిని కోర్టులకు పంపి, వాటిని 50శాతానికి కుదించేయత్నాలు చేస్తున్నాడన్నారు. వైసీపీకి చెందిన బోయ రామాంజనేయులు (రాఫ్తాడు మండల వైసీపీ కన్వీనర్) కోర్టుకి పంపిన జగన్ సర్కారు, హైకోర్టులో కూడా బీసీలకు న్యాయం జరిగేలా వాదనలు వినిపించడంలో విఫలమైందన్నారు.
స్థానికసంస్థల్లో బీసీలకు అన్యాయం జరిగేలా కోర్టు తీర్పురావడానికి జగన్ ప్రభుత్వమే కారణమని రవీంద్ర దుయ్యబట్టారు. రాజధాని విషయంలో తన పంతం నెగ్గించుకోవడానికి రూ.5కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి న్యాయవాదిని నియమించిన జగన్మోహన్ రెడ్డి, బీసీల రిజర్వేషన్లపై హైకోర్టులో జరిగే వాదనకోసం, అనుభవజ్ఙుడైన న్యాయవాదిని ఎందుకు నియమించలేదన్నారు. బీసీలకోసం కనీసం రూ.కోటికూడా ఖర్చుచేయకపోవడంవల్లే, బలహీనవర్గాలవారు తమహక్కులు కోల్పోయే దుస్థితి దాపురించిందన్నారు. జగన్ ప్రభుత్వం హైకోర్టులో సరిగా వాదనలు వినిపించలేకపోయినందునే, రిజర్వేషన్లు 55శాతానికి పరిమితం చేయబడ్డాయని, దానివల్ల బీసీలు దాదాపు 10శాతం స్థానాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. 59శాతం రిజర్వేషన్లు అమలై ఉంటే, బీసీలకు 39శాతం వరకు రిజర్వేషన్లు దక్కేవన్నారు. వైసీపీప్రభుత్వం వచ్చాక బీసీలకు చిల్లిగవ్వ కూడా ఖర్చుపెట్టకపోగా, స్థానికసంస్థల ఎన్నికల్లో వారికి దక్కాల్సిన రిజర్వేషన్లకు కూడా కోతపెట్టిందన్నారు.

గత ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకోసం అమలుచేసిన అనేక సంక్షేమపథకాలను జగన్ రద్దుచేశాడన్నారు.  కోర్టు తీర్పు ప్రకారం బీసీలకు 25శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలవుతాయని, తద్వారా 1200 గ్రామపంచాయతీలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. బలహీనవర్గాలకు అన్యాయం జరగుతున్న నేపథ్యంలో మంచిలాయర్ ద్వారా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాల్సిన బాధ్యత జగన్ పైనే ఉందన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో, కార్పొరేషన్ పదవుల్లో బీసీలకు అన్యాయంచేసిన జగన్ ప్రభుత్వం, తాజాగా రిజర్వేషన్ల అంశంలోకూడా వారికి తీరని అన్యాయం చేయడానికి సిద్ధమైందని రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.