బీసీజీ రిపోర్ట్ లో అమరావతి పై ఏమన్నారు?

February 22, 2020

జగన్ మాటను బీసీజీ నివేదిక తు.చ. తప్పకుండా పాటించినట్లు తెలుస్తోంది. బీసీజీ ఈరోజు  ప్రభుత్వానికి తన నివేదికను అందజేసింది. సమీకృత అభివృద్ధి, రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనే అంశాల ప్రాతిపదికగా రిపోర్టు తయారుచేసినట్టు తెలుస్తోంది. జగన్ మనసు తెలుసుకుని నిపుణులు ఈ నివేదికను తయారుచేసినట్లే ఉంది. ఎన్ని కమిటీలు వేసినా అవి జగన్ చెప్పిన మాటలే రాస్తాయి అని టీడీపీ ఆరోపణలను ఈ నివేదిక నిజం చేసినట్టయ్యింది. 

బీసీజీ నివేదిక కూడా మూడు రాజధానులకే మొగ్గుచూపింది. దీంతో  ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు తథ్యం అని తేలిపోయింది. హైపర్ కమిటీ అని ఏర్పాటుచేసినా అది కూడా జీఎన్ రావు, బీసీజీ నివేదికలను అధ్యయం చేస్తుంది కాబట్టి... కొత్తగా మార్పు అయితే ఉండదు.  అయితే, బీసీజీ నివేదికలో ముఖ్యాంశం ఒకటుంది. రాజధాని తరలిపోయిన అమరావతిని ఏం చేస్తే బాగుంటుందన్న అంశాలపై సలహాలు సూచనలు ఈ నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. 

బీసీజీ కూడా మూడు రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యమని పేర్కొన్నట్టు అవగతం అవుతోంది. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణను నివేదికలో స్పస్టంగా పేర్కొన్నారని తెలుస్తోంది. రాజధానిలో ప్రధాన భాగాలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న నేపథ్యంలో అమరావతి ప్రాంతం నష్టపోకుండా ఆ ప్రాంత అభివృద్ధి వ్యూహం ఎలా ఉండాలన్న దానిపై కీలక సూచనలను ఈ నివేదికలో పొందుపరిచారట. రాజధానులతో పాటు ప్రాంతాల వారీగా ఎంచుకోవాల్సిన అభివృద్ధి వ్యూహాలను సూచించిందట బీసీజీ. వ్యవసాయం, పారిశ్రామిక, పర్యాటక, మత్స్య రంగాల్లో ప్రగతి కోసం తీసుకోవాల్సిన చర్యలను కూడా వివరించింది. ప్రపంచంలో గ్రీన్ ఫీల్డ్ మెగాసిటీలు ఎక్కడున్నాయి, అవి అనుకున్న లక్ష్యాలను సాధించాయా? లేవా? అన్న విషయాన్ని గణాంకాలతో బీసీజీ పేర్కొందట. అదే సమయంలో ప్రపంచంలో బహుళ రాజధానులు, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ కాన్సెప్ట్ సక్సెస్ రేటుపై కూడా కమిటీ సూచనలు చేసింది.
 మరి రాజధాని తప్ప మరేమీ మాకొద్దు అని రాజధాని రైతులు చెబుతున్న నేపథ్యంలో ఇతర ప్రత్యామ్నాయాలను రైతులు ఒప్పుకుంటారా అన్నది చూడాలి.