కరోనా నుంచి భారత్ ను కాపాడుతోంది అదేనా!

August 04, 2020

కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందేే. దాదాపుగా 200కు పైగా దేశాలపై పంజా విసిరిన కరోనా....ప్రపంచవ్యాప్తంగా 14,35,091 మందికి సోకింది. కరోనా బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 82,191 మంది మృత్యువాత పడ్డారు. ఇక, భారత్ లోనూ కరోనా కేసులు 5360కి చేరుకోగా...164 మంది కరోనాబారిన పడి మరణించారు. కరోనాకు చికిత్స అందించడం కోసం హైడ్రాక్సి క్లోరోక్విన్, అజిత్రోమైసిన్, పారాసిటమాల్ వంటి వాటిని ప్రపంచదేశాలన్నీ ఉపయోగిస్తున్నాయి. మరోవైపు, కరోనాకు వ్యాక్సిన్ కనుగొనేందుకు అమెరికా, బ్రిటన్, చైనా దేశాలు...ఇప్పటికే వ్యాక్సిన ట్రయల్స్ పూర్తి చేశాయి. అయితే, వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేసరికి మరికొద్ది నెలలు పట్టవచ్చు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ తో కరోనాను నివారించవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. 

క్షయవ్యాధి నివారణకు ఉపయోగించే బీసీజీ (బాసిల్లస్ కాల్మెట్ గురిన్) టీకాతో కరోనాను కట్టడి చేసే అవకాశముందని వైద్యవర్గాలు, శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ టీకాను వేసుకున్న వారికంటే, వేసుకోని వారిలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని వారు గుర్తించారు. కరోనాతో శ్వాససమస్యలు ఎదుర్కొంటున్న వారికి బీసీజీతో ఉపశమనం కలిగించవచ్చని అంటున్నారు. క్షయవ్యాధి బారిన పడకుండా బాల్యంలోనే పిల్లలకు ఇచ్చే బీసీజీ టీకాతో వారిలో రోగ నిరోధక శక్తి పెరిగి క్షయవాధి బారిన పడకుండా ఉంటారు. ఈ టీకా వల్ల ఇతర వైరస్ లను కూడా తట్టుకునే విధంగా మన రోగ నిరోధక వ్యవస్థ తయారై ఉంటుందని అంటున్నారు. 1920లో కనిపెట్టిన ఈ టీకాను 1948 నుంచి మాస్ ఇమ్యూనేజేషన్ టీకాగా వాడుతున్నారని, ఈ టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత శిశు మరణాల రేటు దాదాపుగా అదుపులోకి వచ్చిందని అంటున్నారు. సంఖ్య చాలావరకు అదుపులోకి వచ్చాయని గుర్తించారు. 

కరోనాను ఎదుర్కొనేందుకు బీసీజీ టీకా చాలామందికి రక్షణ కవచంగా ఉపయోగపడుతోందని అంటున్నారు. బీసీజీ టీకా వేస్తున్న దేశాలతో పోల్చితే, ఈ కార్యక్రమాన్ని చేపట్టని దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని  హ్యూస్టన్లోని ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్ ప్రొఫెసర్ ఆశిష్ కామత్ తెలిపారు.  'బీసీజీ టీకా వేస్తున్న దేశాల్లో బాధితుల సంఖ్య పది లక్షల మందికి 38.4 శాతంగా ఉండగా...వేయని దేశాల్లో ఆ శాతం 358.4గా ఉంది. అలాగే టీకా వేస్తున్న దేశాల్లో మరణాల సంఖ్య 10 లక్షల మందికి 4.28గా ఉంటే, వేయని దేశాల్లో 40గా ఉంది అని తెలిపారు. ఆల్రెడీ కరోనా చికిత్స పొందుతున్న వారిపై ఈ టీకా అంత ప్రభావవంతంగా పనిచేయకపోవచ్చిని అభిప్రాయపడుతున్నారు. కరోనాకు వ్యాక్సిన్ గా బీసీజీ వాడవచ్చా లేదా అన్నదానిపై మరిన్ని పరిశోధనలు జరపాల్సి ఉందన్నారు.