ఇప్పుడు కూడా ఆఫీసుకు వెళ్తున్నవాళ్లకు ఇవీ రూల్స్

June 01, 2020

కరోనా పుణ్యమా అని యావత్ దేశం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ఇలాంటివేళలోనూ ఇంటి నుంచి బయటకు వచ్చి ఉద్యోగం చేస్తున్నోళ్లు లేకపోలేదు. అత్యవసర సేవలతో పాటు.. తప్పనిసరిగా ఆఫీసులకు వెళ్లి ఉద్యోగం చేయాల్సిన వారు కొందరు ఉంటారు. మిగిలిన వారికి భిన్నంగా ఇంట్లో ఉండకుండా వీధుల్లోకి వచ్చి జాబ్ చేస్తున్న వారు కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నది క్వశ్చన్.
తాజాగా దీనికి సంబంధించిన కీలక మార్గదర్శకాల్ని విడుదల చేస్తోంది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. లాక్ డౌన్ వేళ జాబ్ చేసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి.. గంటల కొద్దీ సమయం వీధుల్లో గడిపి వచ్చే వారు ఏమేం చేయాలో చెప్పుకొచ్చారు. ఆ అంశాలేమంటే?
 % లాక్ డౌన్ వేళలోనూ ఆఫీసులకు వెళ్లే ప్రతి వ్యక్తి సబ్బు.. శానిటైజర్ తప్పనిసరిగా వాడాలి
% ఎట్టి పరిస్థితుల్లో ఒకరి చేతిని మరొకరు ముట్టుకోకూడదు
% కళ్లు.. ముక్కు.. నోటిని చేతులు తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
% దగ్గు.. తుమ్ము లాంటివి వస్తే అయితే టిష్యూ.. సాధ్యం కాకుంటే మోచేతిని అడ్డు పెట్టుకోవటం తప్పనిసరి
% రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
% ఆఫీసు నుంచి బయలుదేరే వేళలో ఇంట్లోని వారికి ముందే చెప్పాలి.
% ఇంటి గుమ్మం ముందు బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీళ్ల బకెట్ ఉంచమని చెప్పాలి
%  ఇంటి గుమ్మం దగ్గరే బ్లీచింగ్ కలిపిన నీళ్లతో చేతులు కడుక్కోవాలి
% బెల్ కొట్టకుండా.. ముందే ఇంటి తలుపులు తీసి ఉంచాలి.
%  గుమ్మం దగ్గరే డబ్బా ఒకటి పెట్టాలి. పర్సు.. బండి కీ.. ఫోన్లు.. తదితరాలు అందులో వేయాలి
% ఇంట్లో ఏ వస్తువును తాక కుండా నేరుగా బాత్రూంలోకి వెళ్లాలి
% అప్పటికే వాషింగ్ పౌడర్ వేసిన నీళ్లల్లో బట్టలు వేయాలి
% లోదుస్తులతో సహా అన్ని బట్టల్ని బకెట్ లో వేయాలి
% షాంపూ.. సబ్బుతో సహా తలస్నానం చేయాలి
% తడిపిన దుస్తుల్ని వాషింగ్ మిషన్లో వేయాలి. లేకుంటే బట్టలు ఉతుక్కోవాలి. వాటిని ఎండలో ఆరవేయాలి
% గుమ్మం దగ్గర డబ్బాలో వేసిన పర్సు.. ఫోన్లను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి.
% తర్వాత మరోసారి చేతుల్ని శుభ్రంగా కడుక్కోవటం తప్పనిసరి.