ముస్లింల గురించి కొత్త విషయం వెల్లడి

August 02, 2020

మనం మసీదుల్లో మహిళలను చూడటం చాలా అరుదు. ప్రార్థనల్లో మహిళలు పాల్గొనడం కూడా కనిపించదు. చాలామందికి మసీదుల్లో మహిళలకు ప్రవేశం లేదు అని ప్రచారం అయ్యింది.  అది ముస్లిం సిద్ధాంతం అని నమ్ముతారు. నిజానికి ప్రాంతీయ స్థాయిలో చాలా చోట్ల ఫత్వాలు కూడా జారీ చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే, దీనిపై సరికొత్త విషయం తెరమీదకు వచ్చింది. 

మహారాష్ట్రకు చెందిన ఒక జంట మహిళలను మసీదుల్లో ప్రార్థనకు అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషను వేసింది. ఈ పిటిషను విచారించిన సుప్రీంకోర్టు కొంతకాలం క్రితం ముస్లింలాబోర్డుకు నోటీసులు జారీ చేసింది. దీనిపై ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పందించి అఫిడవిట్ దాఖలు చేసింది. మహిళలకు మసీదుల్లో పురుషులతో సమానంగా హక్కులున్నాయని, ఎవరైనా మసీదుకు వచ్చి ప్రార్థనలు చేసుకోవచ్చు అని పేర్కొంది. ఇస్లాం ఎక్కడా మహిళలకు మసీదులో ప్రవేశానికి నియంత్రణ పెట్టలేదని పేర్కొంది. ఒకవేళ ఎవరైనా దీనిపై ఫత్వాలు జారీ చేసినా అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ముస్లిం పర్సనల్ లాబోర్డు పేర్కొంది. 

అయితే ఇస్లాం సిద్ధాంతాల్లో పురుషులు తప్పనిసరిగా శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొనాలనే నిబంధన పెట్టారు, మహిళలకు మాత్రం వారి విచక్షణకు వదిలేశారు. తప్పనిసరి కాకపోవడంతో మహిళలు క్రమంగా మసీదుకు రావడం తగ్గిపోయి ఉండొచ్చు. కానీ ఎటువంటి నిషేధమూ వారిపై లేదు అని ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది. అంటే... ఇంతకాలం అంతా ఒక భ్రమలో ఉన్నారు. ఇదంతా ఓకే గాని.. ఎందుకు ఈ బోర్డు మసీదు ప్రవేశంపై జారీ అవుతున్న ఫత్వాలను చూసి ఇంతకాలం సైలెంటుగా ఉంది?