ఎమ్మెల్సీని సొంతూరోళ్లే బహిష్కరించారు

February 23, 2020

దిమ్మ తిరిగిపోయేంత భారీ షాక్ తగిలింది ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్సీకి. చేతిలో పదవి ఉంటే నోటికి  వచ్చినట్లుగా మాట్లాడే రాజకీయ నేతలకు హెచ్చరికలా తాజా ఉదంతాన్ని చెప్పాలి. ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న నెల్లూరుజిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత బీద రవిచంద్రను..ఆయన సొంతూరులో వెలి వేశారు.
ఆయన సొంతూరైన అల్లూరు మండలం ఇసుకపల్లిని ఉద్దేశించిన ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యపై గ్రామస్తులు అనూహ్యంగా రియాక్ట్ అయ్యారు. బీదా రవిచంద్రతో ఎవరూ మాట్లాడకూడదని నిర్ణయించటమే కాదు.. ఒకవేళ మాట్లాడితే.. రూ.10వేల జరిమానా విధించాలంటూ గ్రామంలో నిర్ణయం తీసుకోవటం సంచలనంగా మారింది.
ఇంతలా సొంతూరోళ్ల మనోభావాల్ని దెబ్బ తీసేలా సదరు ఎమ్మెల్సీ ఏం వ్యాఖ్యలు చేశారన్న విషయంలోకి వెళితే.. ఊరును ఉద్దేశించి దరిద్రపు ఊరంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని తమ ఎమ్మెల్సీని వెలి వేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ బీద రవిచంద్ర  వాదన మరోలా ఉంది. గ్రామంలో జరిగిన వాస్తవ పరిస్థితి వేరని.. బయట జరుగుతున్న ప్రచారానికి సంబంధం లేదన్నారు. తన గ్రామాన్ని తాను కించపరిచేలా మాట్లాడలేదన్నారు. కేవలం గ్రామంలోని పరిశుభ్రత మీదనే వ్యాఖ్యలు చేశారన్నారు. రానున్న రెండురోజుల్లో ఈ అంశంపై పూర్తి స్థాయిలో మాట్లాడతానని చెప్పారు. ఏమైనా.. పదవిలో ఉన్న ఒక రాజకీయ నాయకుడ్ని సొంతూరోళ్లు వెలి వేసిన వైనం ఇప్పుడు సంచలనమైంది.