టీఆర్ఎస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే.. ఇందులో నిజముందా..?

June 01, 2020

 

గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మొత్తం గులాబీ పవనాలు వీచాయి. అన్ని జిల్లాల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితికే జనం జై కొట్టారు. చాలా జిల్లాల్లో టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపించింది. ఇంతటి బలమైన గులాబీ పవనాలు వీచినప్పటికీ ఖమ్మం జిల్లాలో మాత్రం కారుకు పంచర్‌ తప్పలేదు. టీఆర్‌ఎస్‌ నుంచి హేమాహేమీలు బరిలో నిలిచినా పరాభవమే ఎదురైంది. మొత్తం జిల్లాలోని పది స్థానాల్లో కేవలం ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్‌ మాత్రమే టీఆర్‌ఎస్‌ తరఫున గెలుపొందారు. మిగిలిన తొమ్మిదింటిలో కాంగ్రెస్ ఆరు, టీడీపీ రెండు, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట గెలిచారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన వారిలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లందు శాసన సభ్యురాలు బానోతు హరిప్రియ టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. దీంతో భద్రాచలం నుంచి విజయం సాధించిన పొదెం వీరయ్య పార్టీ మారే విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి అందరిలో కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో పొదెం వీరయ్యను సైతం కారెక్కించేందుకు గులాబీ శ్రేణులు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆయన టీఆర్ఎస్‌లో చేరబోతున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి.

వాస్తవానికి వరంగల్‌ జిల్లా ములుగు కాంగ్రెస్‌ టికెట్టు కోసం సీతక్క, పోడెం వీరయ్యలిద్దరూ పోటీ పడ్డారు. సీతక్కను భద్రాచలం పంపి, తనకు ములుగు టికెట్టు ఇవ్వాలని వీరయ్య పట్టు పట్టిన విషయం తెలిసిందే. అధిష్ఠానం మాత్రం వీరయ్యను భద్రాచలానికి పంపి.. సీతక్కకు ములుగు టికెట్టును ఖాయం చేసింది. అయితే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌, టీడీపీల మధ్య ఓట్ల బదిలీ సక్రమంగా జరగడంతో పోడెం వీరయ్యను విజయం వరించింది. అటు ములుగులోనూ సీతక్క గెలిచింది. తాజాగా గులాబీ అధిష్ఠానం జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై నజర్‌ వేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసేందుకు పదిమంది ఎమ్మెల్యేలను గులాబీ గూటికి చేర్చేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పొదెం వీరయ్యను సైతం కారెక్కించేందుకు గులాబీ శ్రేణులు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దీనిపై పొదెం వీరయ్య తాజాగా స్పందిచారు. ‘‘నేను పార్టీమారే పరిస్థితే తలెత్తదు. నేను పుట్టింది కాంగ్రెస్‌లో.. ఎమ్మెల్యేగా మూడు దఫాలు ఎన్నికైంది కాంగ్రెస్‌ ద్వారానే.. పార్టీలు మారడం నావల్ల కాదు. మీరు భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి నిధులిస్తే ఇవ్వండి.. లేదంటే ఏవిధంగా అభివృద్ధి చేయాలో చూస్తా. నా వెంట పడ్డా నేను పదే, పదే చెబుతున్నా.. నేను వారి మాట వినేది లేదు. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి పోయిన ఎమ్మెల్యేలు ఎందు కోసం వెళ్లారో నాకు అర్థం కావడం లేదు. బోగాల కోసం పోతున్నారేమో చెప్పలేం. నా విషయానికొస్తే మాత్రం కాంగ్రెస్‌తోనే ఉంటా.. ఇందులో ఎటువంటి అనుమానం లేదు’’ అంటూ ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ వార్తలకు బ్రేక్ పడినట్లు అయింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పొదెం వీరయ్య అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి, కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే.