కేసీఆర్ ను భయపెట్టిన భవిష్యవాణి

August 12, 2020

ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా ప్రతి ఏటా నిర్వహించే రంగం మీద ఎక్కువ ఆసక్తి వ్యక్తమవుతుంటుంది. భవిష్య వాణిని వినిపించే జోగిని స్వర్ణలత మాటలకు ప్రాధాన్యతను ఇస్తుంటారు. ఆమె నోటితో వచ్చే మాటలు జరిగి తీరుతాయన్న నమ్మకం లక్షల్లో ఉంటుంది. తాజాగా కరోనా దెబ్బకు అతలాకుతలమవుతున్న వేళ.. ఆమె చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా ఉన్నాయి.

ఎవరు చేసుకున్నది వారు అనుభవించక తప్పదని పేర్కొన్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. భవిష్యత్తులో మరింత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెబుతూనే.. తన ప్రజల్ని తాను కాపాడుకుంటానని అభయమిచ్చారు. రానున్న రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్న ఆమె మాటలు మరింత భయాందోళనలకు గురి చేయటం ఖాయం.

ఇంతకూ ఆమె ఏమేం వ్యాఖ్యలు చేశారన్నది ఆమె మాటల్లోనే చూస్తే.. ‘‘ఎవరు చేసిన కర్మ వాళ్లు అనుభవించక తప్పదు రా. కాపాడుకుందామనుకున్నా కానీ మీ చేతులారా చేసుకుంటున్నారు. నాకు సంతోషం లేదు. రాబోయే రోజుల్లో పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ముందుగానే హెచ్చరిస్తున్నా.

నా భక్తులనీ.. నా బిడ్డలను కాపాడుకుంట. ఐదు వారాలు పూజలు చేయాలి. ఎవరి చేసిన పాపం అనుభవించాల్సిందే. కామంతో కాకుండా భక్తిశ్రద్దలతో నన్ను ఐదు వారాలు పూజలతో పూజా కార్యక్రమాలు పూజించండి. గడప గడప నుంచి బెల్లం రావాలి’’ అని పేర్కొన్నారు.