భీష్మ హిట్టయితే... తెలుగు రాష్ట్రాలకు మంచిది

August 03, 2020

అదేంటి ఒక సినిమా హిట్టయితే... తెలుగు సినిమాకు మంచిది అంటే ఓకే గాని తెలుగు రాష్ట్రాలకు మంచిది అనడం ఏంటి అనుకుంటున్నారా? అవును తెలుగు రాష్ట్రాలకు మంచిది. పెళ్లికి ఆరాటపడే యువకుడి జీవితం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా... ప్రస్తుత సమాజాన్ని వెంటాడుతున్న కలుషిత వ్యవసాయం గురించి చెప్పుకొచ్చింది. ఇందులో ఆర్గానిక్ వ్యవసాయం ఉపయోగాన్ని, మందులతో పండించే పంటల వల్ల కలిగే నష్టాన్ని చాలా సరళంగా ఆసక్తికరంగా వివరించినట్లు ట్రైలర్ లో తెలుస్తోంది. ఆర్గానిక్ వ్యవసాయాన్ని చర్చించిన ఈ సినిమా మంచి హిట్ అయితే.... కచ్చితంగా మన రైతులను, రైతు కుటుంబాలను ఆలోచింపజేసే అవకాశం ఉంది. 

అదేంటి ఆర్గానిక్ గురించి బోలెడు సమాచారం దొరుకుతుంటే... ఓయమ్మో... ఈ సినిమాలో కొన్ని సీన్లు పెట్టినంత మాత్రాన కొత్తగా వచ్చే ఉపయోగం ఏంటి అని కొందరు తేలిగ్గా తీసిపారేయవచ్చు. కానీ అన్నింటికంటే సినిమా చాలా పవర్ ఫుల్. గురు అనే మాట మనకు తెలియదా కానీ సినిమా ద్వారానే నేర్చుకున్నాం. దేవుడా... అనే ఊతపదం రేసుగుర్రం ద్వారానే మన కు బాగా ఎక్కింది. నెవర్ బిఫోర్, ఎవరాఫ్టర్ అనే పదం సినిమాలో పెట్టాకే జనాలకు మరింతగా కనెక్టయ్యింది. తెలుగువారు అత్యంత ఇష్టంగా చూసే మాధ్యమం సినిమా. సినిమా ద్వారా తెలుగు వారికి ఏదయినా బలంగా చెప్పొచ్చు. ట్రైలర్ చూశాక ఈ సినిమాహిట్టయితే రాష్ట్రానికి మంచిది అని ఆ ఉద్దేశంతోనే చెబుతున్నాం. కనీసం రాష్ట్రంలో ఒక వెయ్యిమందిని ఈ సినిమా మార్చినా లక్ష్యం నెరవేరినట్టే అనుకోవాలి.