అఖిల ప్రియపై కేసు పెట్టిన సొంత తమ్ముడు

July 08, 2020
CTYPE html>
ఒకప్పుడు సగం కర్నూలు జిల్లాను గడగడలాడించిన కుటుంబం భూమానాగిరెడ్డి- శోభానాగిరెడ్డిలది. వాళ్లు కన్నెర్ర చేస్తే నోరెత్తే పరిస్థితి ఉండేది కాదు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే పేరు మోసిన కుటుంబాల్లో ఒకటైన ఆ కుటుంబం తల్లిదండ్రుల మరణంతో ఒకరకంగా అనాథలా మారింది. పిల్లలు ఇంకా రాజకీయాల్లో పూర్తిగా రాణించకముందే తల్లిదండ్రులు మరణించడంతో మంత్రి అలంకరించినా అఖిల ప్రియ భవిష్యత్తు అంత భద్రంగా ఏమీ లేదు. ఎందుకంటే నేటి రాజకీయాల్లో నెట్టుకురావడం అంత సులువు కాదు. ఇపుడున్నవన్నీ ప్రతీకార రాజకీయాలే. ప్రతిపక్షంలో ఉండటం, అధికార పక్షం నుంచి ఇబ్బందులు... ఇవన్నీ చాలక ఇపుడు సొంత తమ్ముడు నుంచి ఆమెకు ఆమె సోదరికి పెద్ద సమస్య వచ్చింది.
భూమా దంపతులకు ముగ్గురు పిల్లలు. అఖిల ప్రియ, మౌనిక, జగత్ విఖ్యాత్ రెడ్డి. ఇపుడు తన సొంత అక్కలపై తమ్ముడు జగత్ కేసు పెట్టాడు. కారణమేంటంటే... తల్లిదండ్రులు బతికున్న సమయంలో ఓ స్థలం అమ్మారు. అందులో కుటుంబం మొత్తం సంతకాలు చేసింది. తాను మైనర్ గా ఉన్నపుడు పెట్టిన సంతకాలు చెల్లవు అని, ఆ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుల్లో తనకు వాటా ఉందని, వాటిని ఇప్పించమని అతను అక్కల పై కేసు పెట్టారు. భూమి హైదరాబాదు శివారు ప్రాంతానిది కావడంతో రంగారెడ్డి సివిల్ కోర్టులో జగత్ ఈ కేసు పెట్టారు. ఓ పెద్ద కుటుంబం ఇలా రోడ్డుకు ఎక్కడం... సొంత తమ్ముడు ఇలా ఆస్తి గొడవలపై కోర్టుకు ఎక్కడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తల్లిదండ్రులు ఉంటే... ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు కదా... అని కొందరు రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కుటుంబంలో సైలెంటుగా పరిష్కారం కావల్సిన సమస్య ఇలా నలుగురికి తెలియడంతో రాజకీయంగా ఆ కుటుంబంపై ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదు.  
కొసమెరుపు - తాజాగా తనపై కేసు పెట్టిన తమ్ముడికి కొన్ని నెలల క్రితమే ప్రేమగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అఖిలప్రియ. (కొంపదీసి ఈ కేసు ఇతర పార్టీల కుట్ర కాదు కదా?!)