షాకింగ్: ‘బిగ్ బాస్ విన్నర్‌’పై నాగార్జున కీలక ప్రకటన

April 04, 2020

తెలుగులోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా కితాబందుకుంది ‘బిగ్ బాస్’. ఉత్తరాది నుంచి వచ్చినప్పటికీ ఈ షోకు దక్షిణ భారతదేశంలో సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుందీ షో. ఇక, తాజాగా జరుగుతున్న ‘బిగ్ బాస్’ మూడో సీజన్‌కు కూడా అదే స్థాయిలో స్పందన వచ్చింది. గత సీజన్లతో పోలిస్తే ఇందులో లవ్, ఎమోషన్స్, రొమాన్స్, వార్స్ ఎక్కువగా కనిపించడంతో ప్రేక్షకుల నుంచి ఆదరణను దక్కించుకోగలిగింది. దీనికి తోడు నాగార్జున హోస్టింగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పాలి.
దాదాపు పదిహేను వారాల పాటు సాగిన ‘బిగ్ బాస్’ సీజన్ -3 తుది అంకానికి చేరుకుంది. గత రెండు సీజన్ల వలే ఇందులో కూడా ఐదుగురు కంటెస్టెంట్లు శ్రీముఖి, వరుణ్ సందేశ్, రాహుల్ సింప్లీగంజ్, బాబా భాస్కర్, అలీ రెజాలు ఫైనల్స్‌కు చేరుకున్నారు. వీరిలో ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై వారం రోజులుగా ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో రాహుల్ సింప్లీగంజ్ గెలిచాడని చాలా సంస్థలు పేర్కొంటున్నాయి. అలాగే, ప్రముఖ యాంకర్ శ్రీముఖి విజయం సాధించిందని కూడా వార్తలు వస్తున్నాయి.
ఆదివారం ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ ఒకరోజు ముందుగానే అంటే శనివారంమే జరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇక, విజేతను నిర్ణయించే సమయం దగ్గర పడడంతో గాసిప్స్ అటు వెండితెర వర్గాలతో పాటు ఇటు బుల్లితెర సర్కిళ్లలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు, సోషల్ మీడియాలో మాత్రం ఎవరికి తోచింది వాళ్లు రాసేస్తున్నారు. ఇలాంటి సమయంలో షో హోస్ట్ అక్కినేని నాగార్జున కీలక ప్రకటన చేశారు.
ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌లో ‘‘‘బిగ్‌బాస్-3’ ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ కొద్ది గంటల్లో జరుగబోతుంది. నాకిది చాలా అద్భుతమైన ప్రయాణం. ఫైనల్ ఎపిసోడ్ లైవ్‌లో ప్రసారం కాబోతోంది. సోషల్ మీడియాలో విజేత గురించి వస్తున్న వార్తలను నమ్మకండి. సాయంత్రం జరిగే లైవ్ ప్రోగ్రాంలో విజేత ఎవరనేది తెలుసుకోండి’’ అని ఆయన పేర్కొన్నారు. నాగ్ ప్రకటనతో ఇప్పటి వరకు వచ్చిన వార్తలు ఫేక్ అని తేలడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. దీని ప్రకారం విజేత ఎవరన్నది తెలియాలంటే ఆదివారం సాయంత్రం వరకు ఆగాల్సిందే.