కేసీఆర్ దమ్మేంటో తేలే సమయం వచ్చింది

February 25, 2020

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సమ్మె నేపథ్యంలో నిజంగానే టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు దమ్మేంటో తేలిపోయే సందర్బం వచ్చిందనే చెప్పక తప్పదు. లక్ష పైచిలుకు కార్మికులతో కొనసాగుతున్న టీఎస్ఆర్టీసీలో సమ్మెను కేసీఆర్ అస్సలు ఒప్పుకోలేదు. సమ్మెకు వెళితే... చూస్తూ ఊరుకునేది లేదని, సమ్మెకు దిగే కార్మికులను ఉద్యోగాల్లో నుంచి తొలగించేస్తామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని కూడా కేసీఆర్ కాస్తంత స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్నింగ్ మేరకు కేసీఆర్ చర్యలు తీసుకునే సమయం కూడా వచ్చేసింది. ఎందుకంటే... కేసీఆర్ హెచ్చరికలను ఆర్టీసీ కార్మికులు చాలా లైట్ తీసుకున్నారు. ఉద్యోగాల్లో నుంచి తీసేస్తారా? ఎలా తీస్తారో చూస్తాం? అన్న భావనతో సమ్మె మొదలైన శనివారం ఓ 160 మంది కార్మికులు మినహా లక్షకు పైగా కార్మికులు విధులకు దూరంగానే ఉన్నారు. దీంతోనే కేసీఆర్ దమ్మేంటో తేలే సమయం వచ్చేసిందనే చెప్పాలి.

ఎందుకంటే... సమ్మెకు దిగారన్న కారణం చూపి లక్ష మంది ఆర్టీసీ కార్మికులను తొలగించడం కేసీఆర్ కు కాదు కదా... ఏ సీఎంకు కూడా సాధ్యం కాని పరిస్థితే. అది కూడా ప్రజా రవాణాలో కీలక భూమిక పోషిస్తున్న ఆర్టీసీ లో మొత్తం కార్మికులను ఒకేసారి పీకేయడమంటే మాటలు కాదు. అది ఆచరణ సాధ్యం కూడా కాదు. సో... తాను ఘీంకరించినట్లుగా విధులకు హాజరు కాని ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల్లో నుంచి తొలగించడం కేసీఆర్ కు సాధ్యం కాదనే చెప్పక తప్పదు. ఏదో అలా గట్టిగానే వార్నింగ్ ఇస్తేనన్నా కార్మికులు దారికొస్తారన్న భావనే తప్పించి... లక్ష మంది కార్మికులను కాదు కదా... ఒక్క కార్మికుడిని కూడా ఈ కారణం చెప్పి తొలగించడం సాధ్యం కాదన్న విషయం కేసీఆర్ కు కూడా తెలియనిదేమీ కాదు. 

సరే... కేసీఆర్ దమ్ము తేలిపోయింది కదా. మరి ఈ సమ్మె ఎవరికి షాకిచ్చిందన్న విషయాన్ని కూడా చెప్పుకోవాల్సిందే కదా. ఈ సమ్మెతో ఆర్టీసీ కార్మికులకేమీ పెద్దగా షాక్ తగలలేదనే చెప్పాలి. పోతే గీతే... సమ్మె కాలానికి వేతనాలు పోతే పోతాయి గానీ... కార్మికులకు జరిగే నష్టమేమీ ఉండదనే చెప్పాలి. మరి ఈ సమ్మె ఆర్టీసీ కార్మి్కులకు కాకుండా ఇంకెవరికి షాక్ ఇచ్చిందన్న విషయానికి వస్తే... ఇంకెవరికి? కేసీఆర్ కే ఈ సమ్మె భారీ షాక్ ఇచ్చిందని చెప్పక తప్పదు. సీఎం హోదాలో కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ నే కార్మికులు పట్టించుకోలేదంటే... కేసీఆర్ కే కదా షాక్ తగిలినట్టు. సో... సమ్మెకు వెళితే షాకులు తప్పవన్న కేసీఆర్ కు కార్మికులే రివర్స్ షాకిచ్చారన్న మాట.