మాయా బ‌జార్ హంగామా జూన్ 15 !

August 12, 2020

అమెరికాలోని ప్ర‌వాస తెలుగు ప్ర‌జ‌ల కోసం నిర్వ‌హిస్తున్న మాయా బ‌జార్ కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింది. ఈ వారాంతంలో బే ఏరియాలో మాయా బ‌జార్ పేరిట గ్రేట్ ఇండియ‌న్ ఫుడ్ ఫెస్టివ‌ల్ ను నిర్వ‌హించాల‌ని అసోసియేష‌న్ ఆఫ్ ఇండో అమెరిక‌న్ సంస్థ త‌ల‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. అమెరికాలోని ప్ర‌వాస తెలుగు ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున పాలుపంచుకునే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి భారీ ఏర్పాట్లు జ‌రిగాయి. ఈ శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల నుంచి రాత్రి 7 గంట‌ల దాకా నాన్ స్టాప్‌గా సాగ‌నున్న ఈ కార్యక్ర‌మం అక్క‌డి తెలుగు ప్ర‌జ‌ల్లో జోష్ నింపేందుకు రంగం సిద్ధ‌మైంది.

అయితే వాతావ‌ర‌ణంలో చోటుచేసుకున్న మార్పుల కార‌ణంగా శ‌నివారం పెద్ద తుఫానే వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ట‌. ఈ నేప‌థ్యంలో వాతావ‌ర‌ణ శాఖ నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం సేక‌రిస్తున్న ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్లు.. క్లైమెట్ లో ఎలాంటి మార్పులు లేవ‌ని, శ‌నివారం నాడు తుఫాను ఖాయ‌మేన‌ని, గ‌డ‌చిన రెండు రోజుల్లో వాతావ‌ర‌ణంలో చోటుచేసుకున్న మార్పులే ఇందుకు కార‌ణ‌మ‌ని తేలింది. దీంతో శ‌నివారం ప‌గ‌లంతా నాన్ స్టాప్ గా అవుడ్ డోర్ లో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం క‌ష్ట‌సాధ్య‌మేన‌న్న వాద‌న వినిపించింది.

దీనిపై అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌తో ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్లు ద‌ఫ‌ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిపి... మాయా బ‌జార్ ను ఈ శ‌నివారం కాకుండా వ‌చ్చే నెల (జూన్‌) 15న నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు ఈ వీకెండ్ లో నిర్వ‌హిస్తున్న మాయా బ‌జార్ ను జూన్ 15కు వాయిదా వేస్తున్న‌ట్లుగా ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్ విజ‌య ఆసూరి  ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. తేదీలు మారినా... ముందుగా నిర్ణ‌యించిన వేదిక‌లోనే, ముందుగా నిర్దేశించుకున్న‌ట్లుగానే కార్య‌క్ర‌మాన్ని జూన్ 15న నిర్వ‌హించ‌నున్నామ‌ని, ప్ర‌వాస తెలుగు ప్ర‌జ‌లంతా ఈ మార్పును గ‌మ‌నించాల‌ని ఆసూరి  ఆ ప్ర‌క‌ట‌న‌లో కోరారు.