మైక్రోసాఫ్ట్‌ నుంచి తప్పుకున్న అమెరికా దిగ్గజం

August 04, 2020

మైక్రోసాఫ్ట్‌ను స్థాపించి, వరల్డ్‌ నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో నిలబెట్టిన వ్యాపర దిగ్గజం  బిల్ గేట్స్... ఆ సంస్థకు రాజీనామా చేశారు. మైక్రోసాఫ్ట్ డైరెక్టర్స్ బోర్డు నుంచి తప్పుకున్నారు. అయితే, కంపెనీకి టెక్నికల్ అడ్వైజర్‌గా మాత్రం ఉంటారు. ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ సంస్థల నుంచి కూడా బిల్‌గేట్స్‌ వైదొలిగారు. ఇప్పటికే గేట్స్‌ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న బిల్‌గేట్స్‌.. ఇకపై పూర్తిస్థాయిలో తన కాలాన్ని సమాజ సేవకే వినియోగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాల్లో చిన్నారుల ఆరోగ్యం, విద్య ముఖ్యమైనవి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో చిన్నారుల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. అదే రంగంలో ఉన్నవారికి ఆర్థికంగా, సాంకేతికంగా సాయం కూడా అందిస్తోంది. వ్యాపార బాధ్యతల నుంచి తప్పుకుని, ఇకపై సేవా కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి  పెడతానని బిల్‌గేట్స్‌ తెలిపారు.
1975లో మైక్రోసాఫ్ట్ సంస్థను బిల్ గేట్స్ స్థాపించారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ, అడ్డంకులు దాటుతూ తన కంపెనీని ప్రపంచ నెంబర్‌ వన్‌గా మార్చారు. 2000 సంవత్సరం వరకు కంపెనీ సీఈవోగా ఆయనే ఉన్నారు. 2014లో చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. 2008 నుంచి క్రమంగా ఒక్కో బాధ్యత నుంచి తప్పుకుంటూ వచ్చారు. ఆ సమయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా పూర్తిగా తన బాధ్యతలకు బై చెప్పారు.