ట్రంప్ ఇది మంచి కాదు - బిల్ గేట్స్

August 03, 2020

ట్రంప్ ఎమోషన్స్ పిల్లల కంటే వేగంగా మారిపోతుంటాయి. ఎపుడు కోపం వస్తుందో, ఎపుడు ప్రేమ వస్తుందో ఆయనకే తెలియదు. మోస్ట్ ఎమోషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికన్ హిస్టరీ. అయితే.... కొంతకాలంగా WHO పై మాటిమాటికీ మండిపడుతున్న ట్రంప్ పలుమార్లు తీవ్ర విమర్శలు చేశారు. అయినా కోపం తగ్గక తాజాగా WHOకి అమెరికా నుంచే అందే నిధులను ఆపేశారు. దీనిని ప్రపంచం మొత్తం తప్పుపడుతోంది.

WHO కొంచెం పొరబడిన మాట నిజమే కానీ... ఇపుడు ప్రపంచంలో దాని పాత్ర కీలకమైనది. పైగా దానికి నిధులు కూడా ఎక్కువ అవసరం ఉన్న సమయం ఇది. ఈ నేపథ్యంలో  WHO కి ట్రంప్ నిధులు ఆపడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ట్రంప్ నిర్ణయాన్ని తప్పు పట్టారు.  WHO విషయంలో అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిది కాదన్నారు. ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో ట్రంప్ ఇలా చేసి ఉండకూడదని, తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు.

మరోవైపు ట్రంప్ చేసిన పని తీవ్ర అభ్యంతకరమైనదని జర్మనీ విదేశాంగశాఖ వ్యాఖ్యానించింది. ఈ సమయంలో మరిన్ని పరిశోధనలకు  WHO ని ప్రోత్సహించాల్సింది పోయి ఇలా దెబ్బతీయడం ద్వారా ప్రపంచానికి నష్టం జరుగుతుందని అది ఎవరికీ మంచిది కాదన్నారు. ట్రంప్ నిర్ణయంపై పునరాలోచన అవసరం అన్నారు. ఈ విపత్కర కాలంలో మనం పెట్టగలిగిన మంచి పెట్టుబడి యుఎన్వో సంస్థలకు నిధులు సమకూర్చడమే అని జర్మనీ పేర్కొంది. 

ఐక్యరాజ్య సమితి కూడా ట్రంప్ నిర్ణయంపై ఆవేదన వ్యక్తంచేసింది. కలసి పోరాడాల్సిన సమయంలో పాత గొడవలు తోడుకోవడమా? ఇది విస్మయకరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని కోరుతున్నాం అంటూ ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అభిప్రాయపడ్డారు.