ఏపీలో బీజేపీ వెతుకుతున్న ఆ సీఎం కేండిడేట్ ఎవరో తెలుసా

May 26, 2020

ఏపీలో 2024లో అధికారంలోకి వస్తామని అనుకోవడం లేదని.. అయితే, పదేళ్లలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తామని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన్ను యాంకర్.. ‘మీరు భవిష్యత్తులో ఏపీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా’ అని ప్రశ్నించగా... ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని.. తాను సీఎం కావాలనుకోవడం లేదని అన్నారు. అయితే... ఏపీలో సమర్థులైన నేతలున్నారని.. వారిలో ఎవరైనా తమ పార్టీలోకొచ్చి పనిచేసి సీఎం కాగలరన్నారు.
రాం మాధవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిగొలుపుతున్నాయి. ఏపీలో సమర్థుడైన ఒక నేత... బీజేపీకి సీఎం అభ్యర్థి కాగల నేత.. పార్టీని అధికారంలోకి తేవడంలో సహకరించగల నేత కోసం బీజేపీ చూస్తోందని అర్థమవుతోంది. ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలను కాకుండా ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి పార్టీని అధికారం వైపు నడిపించే దిశగా బీజేపీ పావులు కదుపుతున్నట్లు అర్థమవుతోంది. అయితే.. బీజేపీ ఇందుకోసం టీడీపీ నేతల్లో సెర్చ్ మొదలుపెట్టిందా.. వైసీపీ నుంచి వెతుక్కుంటోందా.. లేదంటే జనసేన నుంచి సీఎం అభ్యర్థిని కోరుకుంటుందా అన్నది చూడాల్సిఉంది.
మరోవైపు రాంమాధవ్ ఈ ఇంటర్వ్యూలో.. తెలంగాణలో 2024లో తాము అధికారంలోకి రావడానికి చాన్సుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడం ద్వారా, అధికారానికి దగ్గరవుతామని రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల నాటికి పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ కలుపుకుని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిని పెట్టనున్నట్టు తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ పాలన నిజాం నిరంకుశ పాలనను తలపిస్తోందన్నారు. ఇక్కడి ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారని, ఆ కారణంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ, పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించడంతో పాటు, మరో రెండు చోట్ల రెండో స్థానంలో నిలిచిందని అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని, అది బీజేపీ పార్టీయేనని అన్నారు.