బాబును సీఎం చేసే ప‌నిలో జ‌గ‌న్‌, బీజేపీ

July 04, 2020

అదేంటి...ఓవైపు తెలుగుదేశం పార్టీలో కుదుపులు...షాకింగ్ ప‌రిణామాలు చోటుచేసుకుంటుంటే...టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడును సీఎం చేయ‌డం ఏంటి...ఆ ప‌నిలో ఆయ‌న రాజ‌కీయ బ‌ద్ద‌శ‌త్రులు అయిన ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, బీజేపీ ఉన్నార‌ని చెప్ప‌డం ఏంటి అనుకుంటున్నారు? నిజంగా నిజ‌మే. ఏపీలో ఇటీవ‌లే ముగిసిన ఎన్నిక‌ల త‌ర్వాత ప‌రిణామాలు...రాబోయే ఎన్నిక‌ల నాటికి చోటుచేసుకోబోయే ఘ‌ట‌న‌ల‌ను చూస్తుంటే....ఏపీలో మ‌ళ్లీ బాబే సీఎం అవ‌డం ఖాయ‌మంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్‌, సీఎం రమేష్ బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. పార్టీ మారిన సుజనా చౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌, గరికపాటి మోహనరావులు లేఖ రాయడంతో.. రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోద ముద్ర వేశారు. ఇవాళ ఈ న‌లుగురు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. కాగా, ఎంపీలను పార్టీ మారిపించిన తీరు, వారిలో ఏకంగా రాజ్య‌స‌భ ప‌క్షం విలీనం చేపించిన విధానం ఆంధ్రుల‌ను ర‌గిలిపోయేలా చేస్తోంది.

ఇక తాజాగా ఏపీ ప్ర‌భుత్వం మాజీ సీఎం చంద్ర‌బాబు విష‌యంలో మ‌రో అవ‌మాన‌క‌ర‌మైన చ‌ర్య‌కు పాల్ప‌డింది. ఉండవల్లిలోని ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రజావేదికలో ప్రస్తుతం ఉన్న టీడీపీకి సంబంధించిన సామగ్రిని తీసుకెళ్లాలని ఆ పార్టీ నేతలకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. కాగా, ప్రజా వేదికను తమకు కేటాయించాలని వారం రోజుల క్రితం ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారు. కార్యకర్తలు, ప్రజలతో అందుబాటులో ఉండేందుకు వీలుగా ప్రజావేదికను కేటాయించాలని ఆ లేఖలో కోరారు. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన ప్రకారం సచివాలయం ఐదో బ్లాక్‌లో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ జరగాల్సి ఉంది. కానీ సదస్సును ప్రజావేదికకు మారుస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. తొలిసారిగా ఈ నెల 24న ప్రజావేదికలోనే కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించి తిరిగి వేదిక‌ను మార్చి ఇలాంటి క‌క్ష‌పూరిత చ‌ర్య‌ల‌కు ప్ర‌భుత్వం పాల్ప‌డింది.

ఇటు రాష్ట్రప్ర‌భుత్వం అటు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌ను ప్ర‌తి ఒక్క ఆంధ్రుడు గుర్తిస్తున్నార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. అధికారం చేప‌ట్టి నెల కూడా గ‌డ‌వ‌ని ఏపీ స‌ర్కారు, ఐదేళ్లుగా ప‌గ‌బ‌ట్టిన ఢిల్లీ స‌ర్కారు చేస్తున్న చ‌ర్య‌ల‌కు 2024లో ఓటు రూపంలో ప్ర‌జ‌లు బుద్ధిచెప్ప‌డం ఖాయ‌మ‌ని...తిరిగి చంద్ర‌బాబు సీఎం పీఠాన్ని అధిరోహిస్తార‌ని...విశ్లేషిస్తున్నారు. పైగా ఏపీ ప్రాణాధార ప్రాజెక్టును ఆపేయమని ఆదేశాలు ఇచ్చి కాళేశ్వరం దగ్గరుండి ప్రారంభించడం, ఏపీని మోసం చేసిన బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టడం, బీజేపీ ఎప్పటికీ ఇవ్వని ప్రత్యేక హోదా విషయం తప్ప మిగతావి మాట్లాడక పోవడం వంటివన్నీ చూస్తుంటే... కచ్చితంగా మళ్లీ టీడీపీ వైపు జనం మళ్లే అవకాశం కనిపిస్తోంది. జనం కక్షసాధింపులను భరించరు. ఇది తెలుగుదేశానికి కచ్చితంగా దీర్ఘకాలంలో సానుకూల అంశమే.