మహారాష్ట్ర సీఎం మారిపోతాడా?

July 13, 2020

మోదీ గత ప్రభుత్వంలో ఎన్డీయే భాగస్వామిగా ఉంటూనే మధ్యలో విభేదించి ఆ తరువాత ఎన్నికలకు ముందు మళ్లీ పూర్తి సహకారం అందించిన శివసేన ఇప్పుడు తన రాజకీయ వ్యూహాలను, విధానాలను చాలా వేగంగామార్చుకుంటోంది. మునుపెన్నడూ లేనట్లుగా బాల్ ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి కీలక పదవి చేపట్టాలని భావిస్తోంది.. అందుకు బీజేపీ సహకారం అందిస్తే దేశవ్యాప్తంగా ఆ పార్టీకి అండగా నిలుస్తామన్న సంకేతాలిస్తోంది. ఆ క్రమంలోనే ఇతర రాష్ట్రాల రాజకీయాలపై శివసేన ఘాటైన వ్యాఖ్యలు చేస్తోంది. జైశ్రీరాం నినాదంపై పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ వివాదం చేయడంపైనా శివసేన స్పందించి... రాముడికి కోపమొస్తే బెంగాల్ మరో అయోధ్య అవుతందని హెచ్చరించింది. ఈ తరహా బీజేపీ సంపూర్ణ అనుకూలత అంతా సొంతింటికి పెద్ద పదవి తెచ్చుకోవడానికేనని తెలుస్తోంది.
శివసేన.. ముంబయి, మహారాష్ట్రల్లో పట్టున్న పార్టీ. సుదీర్ఘ కాలంగా రాజకీయాలు చేస్తోంది. శివసేన అక్కడికే పరిమితమైన పార్టీ అయినప్పటికీ ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఛరిష్మా మాత్రం దేశవ్యాప్తం. కానీ, బాల్ ఠాక్రే కానీ, ఆయన కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే కానీ, ఆ కుటుంబంలోని ఇంకెవరు కానీ ఇంతవరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. పార్టీ పదవులు తప్ప ప్రభుత్వ పదవులు చేపట్టలేదు. పార్టీలోని ఇతర నేతలకే ఆ అవకాశాలు కల్పించారు. కానీ.. తొలిసారి ఉద్ధవ్ కుమారుడు, బాల్ ఠాక్రే మనవడు అయిన ఆదిత్య ఠాక్రే పదవి చేపట్టాలనుకుంటున్నారు.
ఆదిత్యను మహారాష్ట్ర సీఎం చేయాలని ఉద్దవ్ భావిస్తున్నారు. ప్రస్తుతం మహారాస్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి అధికారంలోకి వస్తే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేస్తోంది. కానీ, ఠాక్రేలు డిప్యూటీ పదవులు చేపట్టరంటూ ఆ పార్టీ నేతలు స్పష్టంగా చెబుతుండడంతో ఆదిత్యకు సీఎం పదవి కోసం శివసేన గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు అర్థమవుతోంది. 28 ఏళ్ల ఆదిత్య థాకరే ప్రస్తుతం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.