బీజేపీతో జగన్ ఫ్రెండ్ షిప్... ముగిసిన కథే

June 01, 2020

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో రాసుకుపూసుకు తిరుగుతున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఇకపై కమలనాథులతో అంతగా కలిసి ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. అంతేనా... అసలు బీజేపీతో వైసీపీ దోస్తానా ముగిసిన అధ్యాయమేనన్న వాాదనలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. బీజేపీలో పవర్ సెంటర్లుగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో భేటీ కోసం జగన్ ఆ మధ్య అర్రులు చాచిన వైనం మనకు తెలిసిందే. మోదీ, షాలు ఎంతగా దూరం పెట్టినా... వారిలో భేటీ కోసం జగన్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారు. అయితే మొన్నటి పర్యటనలో భాగంగా ఎలాగోలా మోదీ, షాలతో భేటీ అయిన జగన్... తాను మీతోనే ఉంటానని, అవసరమైతే వైసీపీ ఖాతాలో వచ్చే రాజ్యసభ సీట్లలో ఒకటి, రెండు స్థానాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమని జగన్ చెప్పిన వైనం చూస్తుంటే... బీజేపీతో దోస్తానాను కంటిన్యూ చేసేందుకు జగన్ ఎంతగా తాపత్రయపడుతున్నారన్న విషయం ఇట్టే అర్థమైపోయింది.

అయితే ఓ రాష్ట్రానికి సీఎం హోదాలో ఉన్న జగన్ కు మోదీతో పాటు అమిత్ షా కూడా అపాయింట్ మెంట్ ఇచ్చారని, అయితే జగన్ తో దోస్తానా పెట్టుకునేందుకు వారిద్దరూ సిద్ధంగా లేరని తాజాగా తేటతెల్లమైపోయింది. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత అటు తెలంగాణతో పాటుగా ఇటు ఏపీలోనూ అసెంబ్లీ సీట్ల పెంపు ఎప్పటినుంచో పెండింగ్ లోనే ఉండిపోయింది. అయితే సీట్ల సంఖ్యను పెంపును ఎలాగైనా సాధించుకునే దిశగా అడుగులు వేసిన జగన్ యత్నాలు... గురువారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటనతో విఫలమైనట్టుగానే తేలిపోయింది. అసెంబ్లీ సీట్ల పెంపు ప్రస్తావనే లేదంటూ కిషన్ రెడ్డితో చెప్పించిన అమిత్ షా... జగన్ కు గట్టి షాకే ఇచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే... మొన్న ట్రంప్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ఇచ్చిన విందుకు తెలుగు నేల నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందినా... జగన్ కు మాత్రం ఆ ఇన్విటేషన్ రాలేదు. బీజేపీతో రాసుకుపూసుకు తిరగేందుకు యత్నించడంతో పాటుగా ఏకంగా రెండు రాజ్యసభ సీట్లను ఇచ్చేందుకు కూడా సిద్ధమని జగన్ చెప్పినా కూడా విందుకు జగన్ కు పిలుపు రాలేదంటే... వైసీపీ ఇచ్చే రాజ్యసభ సీట్లు తమకు అవసరం లేదని బీజేపీ తేల్చి చెప్పేసినట్లే కదా. అసలే రాజ్యసభలో మెజారిటీ కోసం ఎప్పటి నుంచో బీజేపీ యత్నిస్తూనే ఉంది. ఇలాంటి క్రమంలో రెండు రాజ్యసభ సీట్లను ఇవ్వడం ద్వారా బీజేపీకి మిత్రపక్షంగా మారాలని జగన్ యత్నించారు. అయితే తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులున్న జగన్ తో స్నేహాన్ని బీజేపీ నేతలు వద్దని అనుకున్న నేపథ్యంలో జగన్ కు ఎలాంటి సహకారం అందించడం లేదన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే... బీజేపీతో తాను కలిసే ఉన్నానంటూ జగన్ చెబుతున్న స్టోరీలు ఇక చెల్లవన్న మాట.