జగన్ లో ఇంత భయం ఉందా?

February 25, 2020

వైఎస్ మరణం తరువాత కాంగ్రెస్ అధినేత్రి సోనియాను ధిక్కరించి సొంతంగా పార్టీ పెట్టుకుని.. ఆ తరువాత తనను ఎన్ని కేసులు చుట్టుముట్టినా ఎంతమంది సీనియర్ నాయకులు, పార్టీలు తనకు వ్యతిరేకంగా పనిచేసినా ఏమాత్రం వెరవకుండా పార్టీని నడిపిస్తూ భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన జగన్ ఎందుకో కానీ బీజేపీని చూసి మాత్రం చాలా భయపడుతున్నారు. తాను సీఎం అయిన తరువాత కేంద్రంతో మంచిగా ఉండేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు... బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మామూలుగా ఉన్న వేళ ఆయన ఏకంగా మోదీకి పాదాభివందనం చేయడానికి ప్రయత్నించడం వంటివన్నీఇప్పటికే అంతా చూశారు. అయితే, తాజాగా... తన పార్టీకి చెందిన ఓ ఎంపీని పార్లమెంటులో మోదీ పేరు పెట్టి పలకరించడంతో జగన్ తెగ టెన్షన్ పడుతున్నారట. హుటాహుటిన ఆ ఎంపీని అమరావతికి పిలిపించుకుని ఏంటి సంగతంటూ వివరాలు తెలుసుకున్నారట. వైసీపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజును గురువారం ప్రధాని మోదీ రాజు గారూ అంటూ పలకరించారు. ఆ వెంటనే జగన్ నుంచి ఆయనకు ఫోన్ వెళ్లడంతో రఘురామకృష్ణంరాజు విజయవాడ చేరుకుని జగన్‌తో భేటీ అయ్యారు. వారి భేటీలో ఏం చర్చించారన్నది ఎవరూ ప్రకటించనప్పటికీ వైసీపీ వర్గాలు మాత్రం ఇతర పార్టీల వైపు చూడొద్దని కోరేందుకే జగన్ ఆయన్ను పిలిచారని చెబుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు ముందు ఆ పార్టీ ఎంపీలతో సీఎం జగన్ మాట్టాడినప్పుడు కూడా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి అనుమతి లేకుండా ప్రధానిని, కేంద్రమంత్రులను కలవకూడదని ఆదేశించారు. అప్పటికే రఘురామరాజు మరికొందరు బీజేపీ పెద్దలను కలవడంతోనే ఆయనలా అన్నారు. ఆ తరువాత సమావేశాలు ప్రారంభమైనాక రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం ఇంగ్లిష్ మీడియానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో గళమెత్తారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ అధిష్టానానికి కోపం తెప్పించాయి. తాజాగా ఆయన.. ప్రధాని మోదీతో సంభాషించడం కూడా పార్టీకి తలనొప్పి తెప్పించాయి. ఇంతకుముందే వైసీపీ ఎంపీలు 10 మంది తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు చెప్పగా.. ఇప్పుడు బీజేపీ ఎంపీ సుజనాచౌదరి 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమతో టాచ్‌లో ఉన్నారంటూ చెప్పడం మరింత వేడి పుట్టిస్తోంది. దీంతో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలతో జగన్ మాట్లాడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పెద్దసంఖ్యలో ఎంపీలను బీజేపీ ట్రాప్ చేస్తోందని ఆయన అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది.