బీజేపీకి చుక్కలు చూపిస్తున్నాడే...

July 08, 2020

అదేమీ ఆజంఖాన్ సొంత అడ్డాలో ఏర్పాటు చేసుకున్న స‌భ కాదు ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌టానికి. భార‌త ప్ర‌జాస్వామ్యానికి ప‌ట్టుకొమ్ముగా ఉండే అత్యుత్త‌మ స‌భ‌ల్లో కీల‌క‌మైన లోక్ స‌భ‌. అలాంటి స‌భ‌లో నోరు జార‌టం ఒక త‌ప్పు అయితే.. చేసిన ఎద‌వ ప‌నిని స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేశారే త‌ప్పించి.. సారీ చెప్ప‌ను పొమ్మ‌న‌టం ఆయ‌న‌కే చెల్లుతుంది. వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిల‌వ‌ట‌మే కాదు.. నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడే గుణం ఎక్కువే. త‌న‌లోని బ‌రితెగింపు ఎంత ఎక్కువ‌న్న విష‌యాన్ని అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చేయ‌ట‌మే కాదు.. త‌న‌ను ఎవ‌రూ కంట్రోల్ చేయ‌లేర‌న్న‌ట్లుగా చెల‌రేగిన తీరు షాకింగ్ గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
ట్రిఫుల్ త‌లాక్ బిల్లుపై చ‌ర్చలో భాగంగా ఆజంఖాన్ మాట్లాడుతుండ‌గా.. కేంద్ర‌మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ జోక్యం చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీనిపై ఆగ్ర‌హం చెందిన ఆజంఖాన్.. స‌హ‌నం కోల్పోయి న‌ఖ్వీవైపు చూస్తూ.. మీరు అటూ ఇటూ కాని మాట‌లు మాట్లాడ‌కండంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై స్పందించిన డిప్యూటీ స్పీక‌ర్ ర‌మాదేవి.. మీరు కూడా అటూ ఇటూ చూడ‌కుండా స్పీక‌ర్ స్థానాన్ని ఉద్దేశించి మాట్లాడాల‌న్నారు.
దీంతో ఆజంఖాన్ దారుణ‌మైన రీతిలో రియాక్ట్ అయ్యారు. డిఫ్యూటీ స్పీక‌ర్ ను ఉద్దేశించి అభ్యంత‌ర‌క‌ర రీతిలో వ్యాఖ్య‌లు చేయ‌టంతో స‌భ‌లో గంద‌ర‌గోళం చోటు చేసుకుంది. దీనిపై ఆయ‌న సారీ చెప్పాలంటూ బీజేపీ స‌భ్యులు గ‌ట్టిగా ప‌ట్టుప‌ట్టినా ఆజంఖాన్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. త‌న‌దైన శైలిలో ఆయ‌న స్పందిస్తూ డిఫ్యూటీ స్పీక‌ర్ త‌న‌కు సోద‌రి లాంటి వార‌ని.. త‌ప్పుగా మాట్లాడుంటే రాజీనామా చేసేందుకైనా సిద్ధ‌మే కానీ సారీ చెప్పేది లేద‌ని వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.
ఆజంఖాన్ వ్యాఖ్య‌ల్ని స్పీక‌ర్ ఓం ప్ర‌కాష్ త‌ప్పు ప‌ట్టారు. స‌భా గౌర‌వాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల‌ని.. అస‌లు అలాంటి ప‌దాన్ని వాడాల్సిన అవ‌స‌రం ఏముంద‌న్న ప్ర‌శ్న వేసిన ఆయ‌న‌.. ఒక మాట మాట్లాడితే అది వెంట‌నే ప్ర‌జ‌ల‌కు చేరిపోతుందంటూ ఆజంఖాన్ వ్యాఖ్య‌ల్ని రికార్డుల నుంచి తొల‌గించారు.
ఆజంఖాన్ వ్యాఖ్య‌ల్ని జాతీయ మ‌హిళా క‌మిష‌న్ ఖండిస్తే.. ఎస్పీ ముఖ్య‌నేత‌ అఖిలేశ్ మాత్రం అండ‌గా నిలిచారు. త‌న‌ను సారీ చెప్ప‌మంటూ బీజేపీ నేత‌లు ప‌ట్టుబ‌ట్టిన‌ప్ప‌టికీ వెన‌క్కి త‌గ్గ‌ని ఆజంఖాన్.. త‌న అనుచిత వ్యాఖ్య‌ల‌కు త‌గ్గ‌ట్లే.. తన త‌ప్పును ఒప్పుకోనేందుకు స‌సేమిరా అంటూ.. స‌భ నుంచి వెళ్లిపోవ‌టం విశేషం. మంది బ‌లం ఉన్న‌ప్ప‌టికీ ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్య‌ల్ని స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకోవ‌టం.. ఆయ‌న చేత క్ష‌మాప‌ణ‌లు చెప్పించ‌టంలో క‌మ‌ల‌నాథులు ఫెయిల్ అయ్యార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.