వాడుకుని అధికారంలోకి వచ్చాక ఇలా చేస్తారా జగన్? 

May 26, 2020

వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమతో ఎన్నో పనులు చేయించుకున్నారని, అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. పల్నాడులో బీజేపీ నిర్వహించనున్న ధర్నా వాయిదా మాత్రమేనని..రద్దు కాదన్నారు. డీజీపీని కలిసి పల్నాడులో పరిస్థితులపై ఫిర్యాదు చేస్తామన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఎంతమంది అవినీతిపరులను వెలికితీశారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం మారి జగన్ ప్రభుత్వం వచ్చాక మైనింగ్ అక్రమ రవాణాలో వ్యక్తులు మారారే కానీ రవాణా ఆగలేదన్నారు.
కాగా పల్నాడులో అక్రమ మైనింగుకు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ధర్నాకు అనుమతులు రాకపోవడంతో వాయిదా వేసినట్లు చెబుతున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో, ఆ తరువాత ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల వరకు కేంద్రంతో అవసరాలుంటాయి కాబట్టి బీజేపీతో సామరస్యంగా ఉండాలన్న వైఖరిని వైసీపీ కనబరిచేది. కానీ.. కొద్ది రోజులుగా వైసీపీ దూకుడుగా వెళ్తోంది. జిల్లాల్లో బీజేపీ నాయకులు చేసే కార్యక్రమాలకు కూడా వైసీపీ నేతల నుంచి ఇబ్బందులు వస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కన్నా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు ఏపీ వైసీపీ ఎంపీలు కేంద్రంలోని బీజేపీతో సయోధ్య మెంటైన్ చేస్తూ తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి కన్నాలో ఉందని చెబుతున్నారు. బీజేపీ అధిష్ఠానం కూడా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడినైన తన కంటే వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తోందని ఆయన వాపోయిన సందర్భాలూ ఉన్నాయి.   ఈ కారణంగానే కన్నా పాత కథలన్నీ తవ్వి తీసి వైసీపిని దెప్పి పొడుస్తున్నారని వినిపిస్తోంది.