అక్కడ లడ్డూల్ని.. పూలదండల్ని ముందే ఆర్డర్ ఇచ్చేశారట

May 30, 2020

ఎన్నికల్లో సాధించే విజయం మీద బీజేపీ ఎంత నమ్మకంగా ఉందన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కాస్త ముందుగానే భారీ ఎత్తున మిఠాయిలకు.. పూలదండలకు ఆర్డర్ ఇచ్చిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందన్న ధీమాతో ఉన్నారు కమలనాథులు.
ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామన్న ధీమాతో ఉన్న బీజేపీకి.. పోలింగ్ అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మొత్తం కమలనాథులకు గెలుపు పక్కా అని తేల్చేశాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలకు బీజేపీ-శివసేన కూటమికి 200 సీట్ల వరకూ వచ్చే వీలుందన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. పలు మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 190-220 మధ్యలో సీట్లు రావటం ఖాయమన్న అంచనాలు వ్యక్తమయ్యాయి.
ఈ రోజు ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపు చూసినప్పుడు వెలువడుతున్న ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే సాగుతున్నట్లు కనిపిస్తున్నా.. 190 కంటే తక్కువ సీట్లకే బీజేపీ-శివసేన పరిమితం అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే.. గెలుపు పక్కా అన్న నమ్మకంతో ఉన్న కమలనాథులు.. విజయం తర్వాత సంబరాలు చేసుకునేందుకు వీలుగా భారీ ఎత్తున లడ్డూలకు.. పూలదండలకు ఆర్డర్ ఇచ్చేసిన వైనం బయటకు వచ్చింది. గెలుపు మీద ఎంత నమ్మకం ఉంటేనే ఇలాంటివి చేస్తారన్న మాట వినిపిస్తోంది.