ఢిల్లీలో బీజేపీ ఓటమికి కారణం కనిపెట్టిన అమిత్ షా

August 14, 2020

ఇటీవల ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాలనకు చరమ గీతం పాడేసి... బీజేపీ పాలనను తీసుకొచ్చే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పకడ్బందీ ప్లాన్లే రచించారు. అయితే విద్యావంతుల ఖిల్లాగా ముద్రపడిన ఢిల్లీలో మోదీ షాల ప్లాన్లు పారలేదు. వరుసగా మూడో పర్యాయం కేజ్రీకి అధికారం కట్టబెట్టిన ఢిల్లీ ఓటర్లు.. బీజేపీకి కాస్తంత గట్టి షాకే ఇచ్చారు. ఈ క్రమంలో పకడ్బందీ ప్లాన్లే రచించినా... ఢిల్లీలో ఎందుకు ఓటమిపాలయ్యామన్న విషయంపై అమిత్ షా ఆత్మ పరిశీలన చేసుకున్నట్లుగానే కనిపిస్తున్నారు. ఢిల్లీలో తమ ఓటమికి కారణం తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలే కారణమని షా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై అమిత్ షా ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘‘కాల్చి పారేయండి’, ‘దేశ ద్రోహులను తరిమేయండి’ వంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఎన్నికల ప్రచారంలో వాడేందుకు బీజేపీ ఎప్పుడూ దూరంగా ఉంటుంది. కానీ, అలాంటి వ్యాఖ్యలు మా పార్టీ నాయకులు ప్రచారంలో భాగంగా ప్రసంగించడం వల్లే మాకు ఎన్నికల్లో నష్టం చేకూరింది. గెలుపోటముల కోసం ఎన్నికల్లో ఎప్పుడూ తలపడలేదు. పార్టీ భావజాల వ్యాప్తి కోసమే ప్రయత్నిస్తున్నాం. అయితే, దిల్లీ ఎన్నికల్లో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్‌పీఆర్ ప్రభావం లేదు’ అని షా తమ పార్టీ ఓటమిపై చాలా క్లారిటీగానే మాట్లాడారని చెప్పాలి.

ఓ మీడియా సంస్థతో గురువారం మాట్లాడిన సందర్బంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించింది కాంగ్రెస్ పార్టీనే అని షా విమర్శించారు. సీఏఏ సంబంధిత అంశాలపై తనతో ఎవరైనా మాట్లాడవచ్చని, ఇందుకోసం తన కార్యాలయానికి రావచ్చని కూడా ఆయన చెప్పారు. వారికి మూడు రోజుల్లో సమయం కేటాయిస్తానని వెల్లడించారు. అయితే, శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని షా అన్నారు. మొత్తంగా ఇతర పార్టీలకు చెందిన కీలక నేతల మాదిరిగా తమ పార్టీ ఓడిపోగానే మీడియాకు ముఖం చాటేయడం, అసలు కారణాలను వెలిబుచ్చకపోవడం వంటి వాటికి దూరంగా ఉన్న అమిత్ షా... ఢిల్లీలో తమ పార్టీ ఓటమికి కారణాలివేనంటూ ప్రకటించడం గమనార్హం.