అమరావతి ... బీజేపీది పచ్చి రాజకీయం

August 15, 2020

అమరావతి రైతుల దుస్థితిని బీజేపీ తన రాజకీయాలకు కేంద్రంగా చేసుకుంది. పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో ఈ సమస్యను కొనసాగించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాన్ని చాలా గట్టిగా చేస్తోంది బీజేపీ. దక్షిణ భారత అయోధ్య అమరావతి, రాజధాని అమరావతి నుంచి కదిలిపోదు అని కొందరు చెబుతున్నారు. అమరావతి అంగుళం కూడా కదలదు అని బీజేపీ ఎంపీ సుజన చౌదరి ఖరాఖండిగా తేల్చారు. సరైన సమయంలో కేంద్రం జోక్యం ఉంటుందని ఆయన చెప్పారు.

మరోవైపు అమరావతి రైతుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని రాష్ట్ర బీజేపీ ప్రకటిస్తుంది. జనసేనతో కలిసి పోరాటాలు చేస్తోందట. తాజాగా బీజేపీ జాతీయ నేత సునీల్ దేవ్ ధర్ ఏపీ రాజధాని విషయంలో బీజేపీ వైఖరి మారదని వ్యాఖ్యానించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తోందట. రైతుల పక్షాన పోరాటాలు చేస్తుందట. అయితే... ఈ మాటలతో పాటు మరో మాట కూడా చెప్పారాయన. 

‘‘ఏపీ రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని, రాజధాని విషయంలో కేంద్రం జోక్యం ఉండదన్నారు. భవిష్యత్‌లో కూడా కేంద్రం జోక్యం చేసుకోదని సునీల్‌ దేవధర్‌ స్పష్టం చేశారు’’

సుజన చౌదరి మాటకు, సునీల్ దేవ్ ధర్ మాటకు ఎంత అంతరం ఉందో చూడండి. ఆయనేమో సరైన సమయంలో జోక్యం చేసుకుంటుంది అంటారు, ఈయనేమో ఎప్పటికీ జోక్యం చేసుకోదు అంటారు. కానీ రాజధాని అమరావతిలోనే ఉండాలట. వీరి నాటకం అర్థం కావాలంటే ఒక చిన్న పిట్టకథ చెప్పుకుందాం.

‘‘ఒక ఊర్లో కమలయ్య అనే ధనవంతుడు ఉంటాడు. ఆయనకు పక్క ఊళ్లో అమరయ్య అనే ఫ్రెండుంటాడు. అమరయ్య పేదవాడు. పక్క ఊరికి వెళ్లినపుడు స్నేహితుడు పడుతున్న కష్టం చూసి ఆయనకు కమలయ్యకు జాలేసింది. ధనవంతుడైన కమలయ్య ఆయన సమస్యను చిటికెలో పరిష్కరించగలరు. కానీ కలమయ్య ఏం చేశారో తెలుసా? ‘‘అమరయ్య నువ్వు ఎంత కష్టపడినా నీ సంపాదన నీకు సరిపోవడం లేదు. నీతో పాటు కూలిపనులకు వస్తాను. నా కూలీ కూడా నీకే ఇస్తాను’’ అన్నాడట. సజ్జనుడు అయిన అమరయ్య... అయ్యా నువ్వు కష్టం తెలియకుండా పెరిగిన ధనవంతుడివి నువ్వు ఈ పనులవీ చేయలేవు. నా పాట్లు నేను పడతాను లే, అని తిరస్కరించాడట. దీంతో కమలయ్య తన మానాన తాను తన ఊరికెళ్లి యథావిధిగా లగ్జరీగా జీవించసాగాడు’’ 

ఇక్కడ కమలయ్య బీజేపీ పార్టీ, అమరయ్య అంటే అమరావతి రైతులు. ఇంక ఏం జరుగుతుందో మీరే అర్థం చేసుకోండి. 

కేవలం ఒక్క ఫోన్ ఫోన్ కాల్ తో బీజేపీ అమరావతి రైతుల సమస్యను పరిష్కరించగలదు అని ఏపీలో అందరికీ తెలుసు. కానీ ఇపుడే పరిష్కరిస్తే వారికేం లాభం. అందుకే వీలైంత కాలం ఈ సమస్యను అలాగే ఉంచి రాజకీయ లబ్ధికి ప్రయత్నం చేస్తోంది.