గెలిచింది టీఆర్ఎస్సే కానీ సంతోషమంతా బీజేపీదే... ఎలా?

February 24, 2020

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయా? 2023లో అసెంబ్లీ ఎన్నికల నాటికి తెరాసకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ బదులు బీజేపీ నిలుస్తుందా? అంటే అవుననే ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ. ఈ ఎన్నికల్లో కారు జోరు స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ - బీజేపీ రెండో స్థానం కోసం పోట్లాడుకున్నాయి. ఫలితాల అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈ  ఫలితాలు బీజేపీ విస్తరణకు తోడ్పడతాయని, ఎలాంటి పొత్తులు లేకుండా బీజేపీ ఒంటరిగా పోటీ చేసి గెలిచిందన్నారు. పైగా తెరాస ఒక్కో వార్డుకు రూ.1 కోటి చొప్పున ఖర్చు చేసి గెలిచిందని ఆరోపించారు.

తెలంగాణలో బీజేపీ విస్తరిస్తోందనేందుకు ఈ ఫలితాలు నిదర్శనమని చెప్పారు. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో బీజేపీ గెలిచిందని, తమకు బీజేపీ పోటీయే కాదని కేటీఆర్ చెప్పారని, సిరిసిల్లలోనే పరాభవం ఎదురైందన్నారు. తెరాస గ్రాఫ్ పడిపోతుంటే, బీజేపీ గ్రాఫ్ దూసుకెళ్తోందన్నారు. తెరాసకు ప్రత్యామ్నాయంగా తాము బలపడుతున్నామని బీజేపీ చెబుతోంది నిజమేనా అంటే కాదనే పరిస్థితి లేదని అంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస 119 స్థానాలకు గాను 88 సీట్లు గెలుచుకుంది. టీడీపీ-కాంగ్రెస్ 21, బీజేపీ 1 స్థానంలో మాత్రమే గెలిచింది. ఆ తర్వాత తెరాస బలం 105కు పైగా పెరిగింది. కానీ లోకసభ ఎన్నికల్లో 16 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న తెరాస కేవలం 9 సీట్లతో సరిపెట్టుకుంది. బీజేపీ ఖాతాలో 4, కాంగ్రెస్ ఖాతాలో 3 పడ్డాయి. లోకసభ ఎన్నికల నాటికి పరిస్థితులు మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల సమయానికి ప్రజలు ప్రాంతీయ పార్టీ వైపు, లోకసభ ఎన్నికల్లో జాతీయ పార్టీల వైపు చూశారని స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.

తాజా మున్సిపల్ ఎన్నికల్లోను ప్రాంతీయంగా అధికారంలో ఉన్న పార్టీతో పాటు అభ్యర్థులను చూస్తారని చెబుతున్నారు. ఇలాంటి ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీల వైపే ఫలితాలు మొగ్గు చూపడం సహజమని గుర్తు చేస్తున్నారు. అయితే తెరాసకు కాంగ్రెస్ స్థానంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా మారే పరిస్థితులు కొట్టి పారేయలేమంటున్నారు. లోకసభ ఎన్నికల్లో గెలవడం మినహా.. తెలంగాణలో కేడర్ పెద్దగా లేని కమలం కాంగ్రెస్‌తో పోటీ పడి వార్డులను గెలుచుకుంది. పైగా తమకు బీజేపీ ప్రత్యామ్నాయం కాదని, కాంగ్రెస్ అని స్వయంగా తెరాస నేతలు చెప్పారు. కానీ బీజేపీ పోటాపోటీగా సీట్లు సాధించింది.

బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు ఎక్కువ. తాజా ఎన్నికల్లో పురపాలక సంఘాల ఫలితాలను పరిశీలిస్తే తెరాస దాదాపు 1,1600 వార్డులు, కాంగ్రెస్ 550 వార్డులు, బీజేపీ 250 వార్డులు గెలుచుకున్నాయి. ఏమాత్రం ఎమ్మెల్యేలు లేని, నిన్నటి వరకు బలం లేని కమలం పార్టీ ఒంటరిగా పోటీ చేసి పట్టులేని పురపాలక ప్రాంతాల్లో మంచి స్థానాలే గెలుచుకుంది. 3 పురపాలక సంఘాలను దక్కించుకుంది కూడా.

బీజేపీకి బాగా పట్టు ఉంటుందని భావించే నగరపాలక సంస్థల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. నిజామాబాద్‌లో ఒంటరిగా పోటీ చేసి నగర పాలక సంస్థను దక్కించుకోవడానికి రెండు సీట్ల దూరంలో నిలిచింది. బండగ్‌పేటలో తెరాసతో (13) పోటీ పడి 10 స్థానాలు గెలిచింది. మీర్‌పేటలో తెరాస (19), బీజేపీ (16)ను అదే పరిస్థితి. కానీ ఇక్కడ కాంగ్రెస్ కేవలం వరుసగా 2, 3 మాత్రమే గెలిచింది. జవహర్ నగర్, నిజాంపేట మినహా మిగతాచోట్ల కాంగ్రెస్‌కు దాదాపు పోటీనిచ్చింది. నగరపాలక ఫలితాల్లో తెరాస 154, కాంగ్రెస్ 40 గెలుచుకున్నాయి. బీజేపీ ఒంటరిగా 65 స్థానాలు గెలుచుకోవడం గమనార్హం. ఇవి ఓ విధంగా బీజేపీకి ఉత్సాహం ఇచ్చే ఫలితాలే అంటున్నారు.