షాకింగ్- కరోనాతో ఏపీ బీజేపీ నేత మృతి

August 10, 2020

భాజపా సీనియర్ నాయకులు, చంద్రబాబు కేబినెట్లో మంత్రి గా పనిచేసిన పైడికొండల మాణిక్యాలరావు మరణించారు. 28 రోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది. కరోనా జయించి తిరిగొస్తారని అందరూ ఆశించారు. ఆయన కూడా కరోనా సోకాక వీడియో విడుదల చేశారు. కానీ 28 రోజులు పోరాడి కరోనాతో మరణించారు.

మాణిక్యాలరావు 20 రోజుల క్రితం ఏలూరు కొవిడ్‌ ఆస్పత్రిలో చేరారు. సీరియస్ అవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో వారం క్రితం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటి నుంచి వెంటిలేటరు మీదే ఉన్నారు. ఆరోగ్యం విషమించిండంతో  శనివారం సాయంత్రం చనిపోయారు. 

 

ఆయన మృతి అందరినీ కలిచివేసింది. సౌమ్యుడు, వివాద రహితుడు అయిన మాణిక్యాలరావు మరణంపై అన్ని పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆయన మరణంపై స్పందిస్తూ... ‘‘కరోనాని జయించి ఆసుపత్రి నుంచి తిరిగి వస్తారని అనుకున్నాను. మాణిక్యాలరావు గారి మృతి నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆయన పవిత్రఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను‘’ అని వ్యాఖ్యానించారు.

1961లో తాడేపల్లిగూడెంలో జన్మించిన మణిక్యాల రావుకి 60 ఏళ్లు. ఆయన ఫొటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించారు. మంత్రి స్థాయికి ఎదిగారు. జై ఆంధ్ర ఉద్యమకారుడు. 2014లో తొలిసారిగా బీజేపీ అభ్యర్థిగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా గెలిచారు. పొత్తు వల్ల 2014 నుంచి 2018 వరకు చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. పొత్తు చెడటంతో ఒక ఏడాది ముందే పదవికి రాజీనామా చేశారు. 

‘‘మాణిక్యాలరావుగారి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా నిజాయితీతో కూడిన సేవలందించారు ఆయన. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను‘‘ అని చంద్రబాబు నివాళి అర్పించారు.