కేసీఆర్ సర్కారుపై రాంమాధవ్ ఫైర్ - బీజేపీ ప్లానేంటి?

August 05, 2020

తెలంగాణ ప్రభుత్వానికి..బీజేపీకి మధ్య మాటల యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే.. టీఆర్ఎస్ నేతల్ని ఉద్దేశించి బీజేపీ నేతలు చూస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అన్నింటికి మించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. ఇటీవల కాలంలో ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేసినోళ్లు కనిపించరు. అంతేకాదు.. ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చేయటం వెనుక ఏం జరిగిందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జన్ సంవాద్ రీజనల్ వర్చువల్ ర్యాలీలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన .. ఒక ప్రభుత్వం ఎలా ఉండకూడదో అన్నదానికి ఉదాహరణ కేసీఆర్ సర్కారని ఫైర్ అయ్యారు.

రాజకీయాల్లో విమర్శలు.. ఘాటు వ్యాఖ్యలు మామూలే కానీ.. కొందరు అధినేతల్ని అంత త్వరపడి మాటలు అనేందుకు ఇష్టపడరు. అందుకు భిన్నంగా రాంమాధవ్ మాత్రం మొహమాటం లేకుండా కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్తగా ఉన్నాయని చెప్పాలి.  ఇంతకీ రాంమాధవ్ ఏమన్నారు? ఎలాంటి వార్నింగ్ ఇచ్చారన్నది చూస్తే.. రానున్న రోజుల్లో కేసీఆర్ రాజకీయ.. అధికార కార్యకలాపాలకుత్వరలో ముగింపు తప్పదని తేల్చటం గమనార్హం.

‘‘ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నించారు. ఫ్రంటూ లేదు. టెంటూ లేదు. హైదరాబాద్ లో ఆయన ఇప్పుడు ఒంటరిగా.. ఏకాకిగా కూర్చున్నారు. అధికార దుర్వినియోగానికి.. అవినీతికి పాల్పడుతూ ప్రజల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు.  సగం.. సగం పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప.. ఏడాదిలో మీరు సాధించింది ఏమైనా ఉందా? అని దుయ్యబట్టినఆయన.. ఏడాదిపాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.

అవినీతికి.. అసమర్థతకు మారుపేరుగా తెలంగాణ ప్రభుత్వం మారిందని.. చివరకు కరోనా పోరాటంలోనే ఈ విషయం అర్థమవుతుందన్నారు. కరోనా కేసులపై తప్పుడు లెక్కలతో మసిపూసి మారేడు చేసినంత మాత్రాన రాష్ట్ర అభివృద్ధి సాధ్యమా? అని ప్రశ్నించారు.

కేంద్ర బృందాలను మోసం చేయగలరేమో కానీ.. కరోనా బారిన పడిన రాష్ట్ర ప్రజలను ఎంతకాలం మోసం చేయగలరు? అని ప్రశ్నించారు. కేంద్రానికి ఆదాయం రాకున్నా.. పన్నుల వాటా కింద తెలంగాణకు సుమారు రూ.20వేల కోట్లు ఇస్తామని కేంద్రం మాట ఇచ్చిందన్న విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రం ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వాలుసీరియస్ గా తీసుకోకపోవటం వల్ల కేసులు పెరిగినట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు కోట్లప్రజలున్న తెలంగాణలో కరనాపరీక్షలు చేయకున్నా పదిహేను వేలు చేసినట్లుగా చెబుతున్నారని చెప్పారు. యూపీలో రోజుకు 20వేల పరీక్షలు చేస్తుంటే.. తెలంగాణలో 2 వేల పరీక్షలు కూడా చేయలేదన్నారు. రాంమాధవ్ వ్యాఖ్యల్ని చూస్తే.. ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ పై ఇంత ఘాటుగా మరెవరూ  అనలేదని చెప్పక తప్పదు.