సీన్ అర్థమైంది.. ఏపీలో ఆ పార్టీ నేతలు కనిపించడం లేదు

July 05, 2020

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో రసవత్తరంగా సాగాయి. ఈ ఎన్నికలను అధికార తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తోడు మిగిలిన పక్షాలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం రంజుగా సాగింది. ఇక, ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని పార్టీల నేతలు సమీక్షలు నిర్వహించుకుంటున్నారు. బూత్‌ల వారీగా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ఇవన్నీ పూర్తి చేసుకుని విజయం తమదంటే తమదంటూ చెప్పుకుంటున్నారు. ఇందులో టీడీపీ, వైసీపీ శ్రేణులు మిగిలిన పార్టీల కంటే ముందున్నాయి. ఇక, ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన జనసేన పార్టీ.. ఎన్నికల తర్వాత అంతగా స్పందించడం లేదు. కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయింది.

2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిన బీజేపీ.. అప్పుడు నాలుగు ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాలను దక్కించుకుంది. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి పైడికొండల మాణిక్యాలరావు, కృష్ణా జిల్లా కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం సిటీ నుంచి ఆకుల సత్యనారాయణలు బీజేపీ తరపున శాసనసభకు ఎన్నికైన వారిలో ఉన్నారు. అలాగే, విశాఖ పార్లమెంట్‌కు కంభంపాటి హరిబాబు, నరసాపురం నుంచి గోకరాజు గంగరాజు విజయం సాధించారు. అయితే, వీరిలో ఇప్పుడు ఇద్దరు మాత్రమే బరిలో నిలిచారు. విష్ణు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయగా, మాణిక్యాలరావు మాత్రం నరసాపురం ఎంపీగా బరిలో నిలిచారు.

ఈ రెండు స్థానాల్లో బీజేపీ గెలిచే చాన్సే లేదనేది అందరికీ తెలిసిందే. నిధుల కేటాయింపు విషయంలో కూడా కేంద్రంపై అక్కడి ప్రజలు గుర్రుగా ఉన్నారు. టీడీపీ-బీజేపీతో కలిసున్నంత కాలం ఆ పార్టీపై మంచి అభిప్రాయంతో ఉన్న ఏపీ జనాలు.. ఎప్పుడైతే ఆ పార్టీ ఎన్డీయే నుంచి బయటికి వచ్చిందో అప్పటి నుంచి బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా విభజన హామీలు అమలు విషయంలో ఏపీని మోసం చేసిందనే కారణంతో అక్కడి ప్రజల దృష్టిలో బీజేపీ ద్రోహిగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకుంది. ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకేనేమో ఆ పార్టీకి చెందిన నేతలు కనిపించడమే లేదు. గతంలో మాట్లాడితే మీడియా ముందుకు వచ్చే కొందరు ముఖ్య నేతలు ఇప్పుడు ఏమైపోయారో కూడా తెలియడం లేదు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కూడా ఎన్నికల తర్వాత అందుబాటులో లేరు. సో.. బీజేపీ నేతలకు సీన్ అర్థమైందన్న మాట.