వాటె పాలిటిక్స్... వారం రోజుల్లో తలరాత మారింది

July 13, 2020

ఓట‌ర్లు మ‌హా తెలివైనోళ్లు. అలాంటోళ్ల‌కు తాయిలాలు ఇచ్చి ఓట్లు వేయించుకోవాల‌న్న పార్టీల ఆశ‌ల్ని ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ‌దైన శైలిలో ఓట్ల‌తో స‌మాధానం ఇస్తుంటారు. ఏ ఎన్నిక‌ల‌కు ఏ పార్టీకి ఓటు వేయాల‌న్న విష‌యంలో వారికున్నంత క్లారిటీ రాజ‌కీయ పార్టీల‌కు లేద‌ని చెప్పాలి. అన్ని ఎన్నిక‌ల్ని ఒకేలా చూసే రాజ‌కీయ‌పార్టీల‌కు భిన్నంగా ఓట‌ర్ల మైండ్ సెట్ ఉంద‌న్న విష‌యం ఇప్పుడొస్తున్న ఫ‌లితాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.
ఇటీవ‌ల వెల్ల‌డైన లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో క‌న్న‌డిగులు మెజార్టీ స్థానాల్ని క‌మ‌ల‌నాథుల‌కు క‌ట్ట‌బెట్టేశారు. దీంతో.. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్‌.. జేడీఎస్ పార్టీల ప‌నైపోయింద‌ని.. ఆ ప్ర‌భుత్వానికి నూక‌లు చెల్లిపోయాయ‌ని.. రేపోమాపో అన్న‌ట్లుగా ప‌రిస్థితి మారింద‌న్న మాట బ‌లంగా వినిపించింది.
క‌మ‌ల‌నాథుల్లో కూడా ఉత్సాహం క‌ట్ట‌ల తెగి.. కుమార‌స్వామి ప్ర‌భుత్వాన్నిసాగ‌నంప‌టానికి ముహుర్తాలు చూస్తున్న ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. తాజాగా విడుద‌లైన స్థానిక ఫ‌లితాలు క‌ర్ణాట‌క బీజేపీకి దిమ్మ తిరిగే షాక్ త‌గిలింది. తాజాగా క‌న్న‌డిగులు ఇచ్చిన ఓటు తీర్పుతో క‌మ‌ల‌నాథుల్లోజోష్ ఒక్క‌సారిగా మాయ‌మ‌య్యే ప‌రిస్థితి. ఎందుకిలా అంటే.. ఓట‌ర్లు ఇచ్చిన తీర్పు అలాంటిది మ‌రి.
రాష్ట్ర వ్యాప్తంగా 19 ప‌ట్ట‌ణ పంచాయితీలు.. ఏడు న‌గ‌ర పాల‌క సంస్థ‌ల‌తోపాటు 30 మున్సిపాలిటీల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో అత్య‌ధిక స్థానాలు కాంగ్రెస్‌.. జేడీఎస్ లు గెలుపొందాయి. వార్డుల ప్ర‌కారం చూస్తే 714 పుర‌స‌భ‌ల్లో కాంగ్రెస్ 322 స్థానాల్లో.. బీజేపీ 184 స్థానాల్లో.. జేడీఎస్ 102 స్థానాల్లో.. ఇత‌రులు 107 స్థానాల్లో విజ‌యం సాధించారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో త‌ప్పించి బీజేపీకి మ‌రెక్క‌డా ఓట‌ర్లు క‌రుణించింది లేదు.
ప‌ట్ట‌ణ పంచాయితీల ప‌రిధిలో 290 వార్డుల్లో కాంగ్రెస్ కు 97.. బీజేపీ 126 స్థానాల్లో.. జేడీఎస్ 34.. ఇత‌రులు 33 చోట్ల గెలుపొందారు. న‌గ‌ర స‌భ‌ల ప‌రిధిలో 217 స్థానాల‌కు కాంగ్రెస్ 90.. బీజేపీ 56.. జేడీఎస్ 38.. ఇత‌రులు 33 స్థానాల్లో విజ‌యం సాధించారు. మొత్తంగా వార్డులు ప‌రిశీలిస్తే 1221 స్థానాల‌కు కాంగ్రెస్ 509 స్థానాల్లో.. బీజేపీ 365 స్థానాల్లో.. జేడీఎస్ 174 స్థానాల్లో.. స్వ‌తంత్రులు 172 స్థానాల్లో గెలుపొందారు. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో మొత్తం 28 స్థానాల‌కు 25 స్థానాల్లో బీజేపీ గెలుపొందితే.. అందుకు భిన్నంగా తాజా ఫ‌లితాలు ఉండ‌టం చూస్తే.. ఏ ఎన్నిక‌ల‌కు ఎవ‌రికి అధికారం అప్ప‌జెప్పాల‌న్న విష‌యంపై ఓట‌ర్లు ఫుల్ క్లారిటీతో ఉన్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.