బీజేపీ నేత‌ల‌కు కేంద్ర‌మంత్రి వార్నింగ్‌...రాజ‌ధానిపై నోరు మెద‌ప‌వ‌ద్దు

February 25, 2020

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంలో బీజేపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు పార్టీని తీవ్రంగా ఇరుకున పెడుతున్న సంగ‌తి తెలిసిందే.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేత‌లు రాజ‌ధాని విష‌యంలో విభిన్న ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ‌ అధికార ప్రతినిధి జీవీఎల్ న‌ర‌సింహారావు ఇటీవ‌ల మీడియాతో మాట్లాడుతూ..`నేను చెప్పేదే జాతీయ పార్టీ విధానం...మా పార్టీలో ఎవరు ఏం మాట్లాడినా అది కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే` అని చెప్పిన‌ప్ప‌టికీ...కామెంట్లు ఆగ‌లేదు. దీంతో మ‌రో జాతీయ నేత‌, కేంద్ర మంత్రి మ‌ళ్లీ క్లాస్ తీసుకున్నారు. ఏపీలోని 3 రాజధానుల అంశంపై  బీజేపీ ఎంపీలు తలో మాట మాట్లాడవద్దని కేంద్ర హోం శాఖ స‌హాయ‌మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.
హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కిష‌న్‌రెడ్డి  రాజ‌ధాని మార్పు, మూడు రాజ‌ధానుల అంశంపై కమిటీ నివేదిక వచ్చేదాక మౌనంగా ఉండాలని బీజేపీ నేత‌లు, ప్ర‌ధానంగా ఎంపీల‌కు సూచించారు. రాజధాని అంశం రాష్ట్ర  ప్రభుత్వ పరిధిలోనిదే అయినప్పటికీ, ఏ రకంగా మూడు రాజధానులు చేస్తారు? వాటి విధి, విధానాలు ఏమిటనే దానిపై కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే.. బీజేపీ రాష్ట్ర, జాతీయ పార్టీలు ఓ నిర్ణయం తీసుకుంటాయని కిష‌న్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ తన అభిప్రాయం చెబుతుందని, అప్పుడు తానే స్పందిస్తానన్నారు.
ఇక రాజకీయాల గురించి స్పందిస్తూ...సీఏఏ వల్ల ఏ ఒక్క భారతీయ పౌరుడికి నష్టం జరుగదని, అలాంటప్పుడు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఆయా పార్టీల నేతలు చెప్పాలని కిష‌న్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎలక్షన్లలో బీజేపీకి మజ్లిస్ పార్టీయే అసలైన ప్రత్యర్థి అని అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, కాంగ్రెస్ నాయకులు గెలిచినా టీఆర్ఎస్‌లోనే చేరతారన్నారు.