కన్నీళ్లు పెట్టిన ఎమ్మెల్యే !

May 25, 2020

తెలుగు టీవీ సీరియ‌ల్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో సాగుతున్న కుమార‌స్వామి స‌ర్కారు బ‌ల‌ప‌రీక్ష‌పై చ‌ర్చ వేళ‌.. ఊహించ‌ని రీతిలో ఒక ప‌రిణామం చోటు చేసుకుంది. బీజేపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే ఒక‌రు త‌న వేద‌న‌ను చెప్పుకొని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. న‌కిలీ గే (స్వ‌లింగ సంప‌ర్కుల) సెక్స్ వీడియోతో త‌న ప‌రువు తీశారంటూ వాపోయారు. 
బీజేపీ సీనియ‌ర్ నేత‌.. ఎమ్మెల్యే అర‌వింద్ లింబావ‌ళిని పోలిన‌ట్లుగా ఉండే వ్య‌క్తి.. మ‌రొక వ్య‌క్తిని ముద్దు పెట్టుకునే వీడియోను త‌యారు చేయించి సోష‌ల్ మీడియాలో త‌న పేరుతో వైర‌ల్ చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి వీడియోల‌తో త‌న‌ను భ‌య‌పెట్టాల‌ని.. త‌న‌ను రాజ‌కీయంగా దెబ్బ తీయాల‌ని చూస్తున్న‌ట్లుగా ఆరోపించారు.
ఈ కుట్ర‌లో అధికార‌ప‌క్షంతో పాటు.. సొంత పార్టీకి చెందిన నేత‌లు కూడా ఉన్నారంటూ అనుమానం వ్య‌క్తం చేశారు. ఈ అంశంపై టైం వ‌చ్చిన‌ప్పుడు మ‌రింత వివ‌ర‌ణ ఇస్తాన‌న్న ఆయ‌న‌.. ఇలాంటి వీడియోల‌తో కుటుంబ స‌భ్యులు ఎన్ని అవ‌మానాలు.. ఇబ్బందులు ఎదుర్కొంటారో తెలుసా? అంటూ ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మార్పింగ్ వీడియో అంశంపై విచార‌ణ‌కు ఆదేశించాల‌ని స్పీక‌ర్ ను ఆయ‌న కోరారు. 
ఇదిలా ఉంటే లింబావ‌ళి అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లుగా జేడీఎస్ ఎమ్మెల్యే శివ‌లింగ గౌడ్ ఆరోపించ‌గా.. ఆయ‌న రియాక్ట్ అవుతూ.. న‌కిలీ వీడియో కార‌ణంగా తానెంత క్షోభ‌ను అనుభ‌వించానో తెలీద‌న్నారు. ఇలాంటి ప‌రిస్థితి మీకు ఎదురైతే.. మీ కుటుంబం ప‌డే బాధ ఎంతో తెలుస్తుంద‌న్న ఆయ‌న‌.. ఈ వీడియో కార‌ణంగా త‌మ ఇంట్లో పిల్ల‌లు ఎంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారో త‌న‌కు మాత్ర‌మే తెలుసంటూ ఉద్వేగానికి గుర‌య్యారు. ఈ సంద‌ర్భంలో స్పీక‌ర్ ర‌మేశ్ కుమార్ ఆయ‌న్ను స‌ముదాయించారు. త‌న‌పై న‌కిలీ వీడియోను త‌యారు చేసిన వారిని గుర్తించాలంటూ ఇప్ప‌టికే ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఏమైనా.. ఇలాంటి తీరు ఏ మాత్రం స‌రికాదు. రాజ‌కీయంగా స‌వాల‌చ్చ ఉండొచ్చు.. రాజ‌కీయంగా ఎదుర్కోవాల్సిన అంశాల్ని అలా కాకుండా భిన్న‌మైన రీతిలోకి వెళ్ల‌టం ఎవ‌రికి మంచిది కాదు.