బీజేపీ ప్లాన్ మార్చేసింది

July 08, 2020

కర్ణాటకలో సంకీర్ణ సర్కారుకు నిజంగానే ఊపిరి వచ్చేసింది. కాంగ్రెస్- జేడీఎస్ సర్కారును ఎప్పుడెప్పుడు కూల్చేద్దామా? అంటూ ఎదురుచూస్తున్న బీజేపీ... అందుకోసం రచించిన ఆపరేషన్ కమల వ్యూహాన్ని తాత్కాలికంగా ఆపేసిందట. అయినా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ బీజేపీకి అనుకూలంగానే వచ్చినా.. కర్ణాకటలో ఈ వ్యూహాన్ని బీజేపీ ఎందుకు ఆపేసిందన్న విషయానికి వస్తే.. ఆసక్తికర వాదన వినిపిస్తోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ సర్కారును కూల్చే పనిని ముందుగా తేల్చేసిన తర్వాత... కర్ణాటక విషయాన్ని చూద్దామని బీజేపీ అధిష్ఠానం తీర్మానించిందట. ఈ క్రమంలోనే కుమారస్వామిని ఎప్పుడెప్పుడు దించేసి సీఎం పీఠాన్ని ఎక్కేద్దామా? అంటూ కాసుక్కూర్చున్న బీఎస్ యడ్యూరప్పకు ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయట.

ఏడాది క్రితం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 సీట్లలో బీజేపీ 104 సీట్లను గెలిచింది. బీజేపీతో హోరాహోరీగా పోరాడిన కాంగ్రెస్ పార్టీకి ఓ స్వతంత్ర అభ్యర్థితో కలుపుకుని 78 సీట్లు, జేడీఎస్ కు... బీఎస్పీకి దక్కిన ఓ సీటుతో కలుపుకుని 38 సీట్లు వచ్చాయి. ఈ క్రమంలో కింగ్ మేకర్ గా మారిన జేడీఎస్ నేత కుమారస్వామి అనూహ్యంగా కింగ్ అయిపోయారు. లెక్కల గోలలో ముందుగా సీఎం పీఠంపై కూర్చున్న యడ్యూరప్ప రోజుల వ్యవధిలోనే దిగాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి కన్నడనాట అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఆపరేషన్ కమలకు రెడీ అయిపోయిన బీజేపీ... కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి నుంచి ఎమ్మెల్యేలను లాగేసేందుకు యత్నిస్తూనే ఉంది.

ఇప్పటికప్పుడు ఈ ఆపరేషన్ ను ఓకే చేసినా... కాంగ్రెస్ నుంచి ఏడుగురు, జేడీఎస్ నుంచి ముగ్గురు మొత్తంగా పది మంది అధికార కూటమి ఎమ్మెల్యేలు పది మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగానే ఉన్నారు. ఇదే జరిగితే... కుమార సర్కారు కూలడంతో పాటు ఆ వెంటనే యడ్యూరప్ప సీఎం అయిపోవడం కూడా ఖాయమే. సార్వత్రిక ఫలితాలు వెలువడిన మరుక్షణమే ఈ మార్పు తథ్యమన్న వాదన కూడా వినిపించింది. అయితే మధ్యప్రదేశ్ లో ఇప్పటికే ఈ ఆపరేషన్ రంగంలోకి దిగేసింది. సో... మధ్యప్రదేశ్ వ్యవహారాన్ని తేల్చేశాక... కుమార సంగతి చూద్దామంటూ యడ్డీకి బీజేపీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసిందట. అంటే.. మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ను పదవీఛ్యుడిని చేసేదాకా కుమారకు ఇబ్బంది లేదన్న మాట. సో... అప్పటిదాకా కుమార ఊపిరి పీల్చుకోవచ్చన్న మాట.