సుజనా... విన్నావా? బీజేపీలో చేరినా వదిలిపెట్టరట

December 13, 2019

ఏపీలో రాజకీయం చాలా రసకందాయంలో ఉంది. దేశ వ్యాప్తంగా ప్రతిరాష్ట్రంలో బీజేపీ బలంగా ఉండాలన్న వ్యూహంతో మోడీ ముందుకు సాగుతున్నాడు. దీనికోసం రాష్ట్రానికి ఒక విధానం పాటిస్తున్నారు. అయితే, నేతలను చేర్చుకోవడానికి మాత్రం దేశమంతటా ఆ పార్టీది ఒకటే విధానం. ఎందుకొచ్చిన గొడవలేబ్బా అంటూ కేసులున్న వారందరూ ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. వారు అడిగిందే తడవుగా బీజేపీ సభ్యత్వం ఇస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు ముందు సీబీఐ రైడ్లు జరిగిన నేతలు ఫలితాలు వచ్చి టీడీపీ ఓడిపోయాక నెల తిరిగే లోపు బీజేపీ బాట పట్టారు.
ఈ చేరికలపై ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు. వారు తమ ఆస్తులు రక్షించుకోవడానికి బీజేపీలోకి పోయిన విషయం చాలా స్పస్టంగా అర్థం అవుతుండటంతో లైట్ తీసుకుంటున్నారు. దీంతో వారి చేరికల వల్ల బీజేపీకి ఒరిగిందేం లేదు. అందుకే బీజేపీ నేతలు వారు పార్టీలో చేరినా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల జీవీఎల్ మాట్లాడుతూ బీజేపీలో చేరిన వారు కేసులుంటే వాటిని వ్యక్తిగతంగా ఎదుర్కోవాల్సిందేనని వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అంటే ఈ వ్యవహారం చూస్తుంటే...వారిని బీజేపీలో చేర్చుకున్న ఉద్దేశం... వారి వల్ల బీజేపీకి లాభం జరుగుతుందని కాదు, టీడీపీ బలహీనపరచడం, భయాందోళనలకు గురిచేయడమే.
పైగా పార్టీలో చేరిన నేతలు స్వయంగా తమ భవిష్యత్తును తమంతట తాము కాలరాసుకుంటున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే... వారు బీజేపీ తరఫున ఏపీ గురించి మాట్లాడుతున్న మాటలు ప్రజలకు కోపం తెప్పిస్తున్నాయి. ఇటీవల విజయవాడ పర్యటనలో సుజనాచౌదరి మాట్లాడుతూ ఏపీకి హోదా ముగిసిన అధ్యాయం అంటున్నారు. విభజన నిధుల గురించి చెప్పరు. ఏపీ రాజధానికి అన్నీ ఇచ్చాం అంటున్నారు. ఇట్లాంటి మాటలు విన్నాక కూడా ఏపీ ప్రజలకు బీజేపీపైన, బీజేపీ ప్రభుత్వంపైన ప్రేమ కలుగుతుందా? తాజాగా రాంమాధవ్ మాట్లాడుతూ ఏపీలో బీజేపీదే రాజ్యం అంటున్నారు. బీజేపీ రాజ్యం సంగతి తర్వాత... బీజేపీ సభ్యత్వ టార్గెట్ ను కూడా బీజేపీ చేరుకునే పరిస్థితి లేదు. మహా అయితే బీజేపీ టీడీపీని బలహీన పరచగలదు గాని... తాను మాత్రం బలపడే సూచన కనుచూపు మేర కనిపించడం లేదు.