​బీజేపీ ఏపీ ప్లాన్స్ విన్నారా?

May 27, 2020

రెండోసారి ​ప్రపంచంలో ఏ పార్టీ అధికారంలోకి రాలేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు బీజేపీ నేతలు. కేంద్రంలో రెండోసారి గెలిచిన వెంటనే వారికి ఏదీ అసాధ్యం అనిపించడం లేదు. అసలు అధికారం గురించి అయితే అది సంకలో పిల్లి అన్నట్లు మాట్లాడుతున్నారు. ఏపీలో ప్రధాని సభ పెడితే పట్టుమని పదివేల మంది రారు. ఇక ఇతర బీజేపీ నేతల సంగతి గురించి మాట్లాడక పోవడమే మంచిది. ఎందుకంటే వారి సభలకు వెళ్లడమే జనం అవమానంగా ఫీలయ్యే పరిస్థితి. అలాంటి బీజేపీ భవిష్యత్తు లక్ష్యాల గురించి చెబుతుంటే, అది కూడా ఏపీలో ... అదెంత పెద్ద జోక్ అనేది మీకే అర్థమవుతుంది.
ఆ పార్టీ రాష్ట్ర నేత మాణిక్యాలరావు మాట్లాడుతూ కొన్ని జోకులు పేల్చారు.
1. రాబోయే 2024 ఎన్నికల్లో బీజేపీ ఏపీలో అధికారంలోకి వస్తుంది.
2. బీజేపీ సభ్యత్వ నమోదు లక్ష్యం రాష్ట్రంలో 20 లక్షలు.

అసలు బీజేపీ నేతలు ఇది ప్రజాస్వామ్యం అని, ఇందులో ప్రజలు అనే వాళ్లు ఉంటారని గుర్తించడం లేదేమో. టీడీపీ నాయకులంతా త్వరలో బీజేపీలో చేరతారన్నది ఆయన గారి ఉవాచ. ఏమో చేరచ్చేమో. పెద్ద ఎత్తున డబ్బులు, ఐటీ బెదిరింపులు చేస్తే చేరొచ్చేమో? మరి బీజేపీ అంటేనే కారాలు మిరియాలు నూరే ఏపీ ప్రజలను ఎలా బెదిరిస్తారు? వారిని ఎలా ఆకట్టుకుంటారు? ప్రజలను పార్టీలోకి చేర్చుకోవడం అంటే... ఎన్నికల్లో గెలిచినంత సులువు కాదు, పార్టీ కండువా వేసుకోవాలంటే ముందు పార్టీ కార్యకర్త గుండెలను తాకాలి. అదంత ఈజీనా? ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించినంత సులువు అనుకుంటున్నారేమో. ఫీల్డులో దిగాక తత్వం బోధపడుతుంది.
ఇక ఈసారి బీజేపీ ఏపీలో సభ్యత్వాల టార్గెట్ 20 లక్షలు పెట్టుకుంది. ప్రతి సభ్యత్వానికి డబ్బులు పంచినా పది లక్షల మంది కూడా బీజేపీ సభ్యత్వాలు తీసుకోలేని పరిస్థితి. నాయకులు మోడీకి, బీజేపీకి భయపడతారేమో గాని ప్రజలెందుకు భయపడతారు? అందుకే అన్ని పనులు అధికారంతో సాధించలేం అని చెప్పేది. జీవితమైనా, రాజకీయమైనా కాస్త క్రమశిక్షణ, ప్రేమ, అనురాగం ఉండాల్సిందే.