కేసీఆర్ సర్కారుపై బండి సంజయ్ షాకింగ్ వ్యాఖ్యలు..

August 07, 2020

అసలే ఫైర్ బ్రాండ్. దానికి తోడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పదవిని చేపట్టిన బండి సంజయ్.. ఏ మాత్రం అవకాశం వచ్చినా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. డైలీ బేసిస్ లో.. కేసీఆర్ ప్రభుత్వంపై మూడు ఆరోపణలు.. ఆరు విమర్శలన్నట్లుగా ఆయన తీరు ఉంది. తాజాగా ప్రభుత్వం సర్కారు తీరును తప్పు పట్టిన ఆయన.. వ్యక్తుల కోసం జీవోలు జారీ చేయటం ఏమిటి? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఉద్యోగ సంఘాల నేతలు.. ప్రభుత్వం సాధించిన ఘనతను తప్పు పట్టారు. ఉద్యోగ సంఘాల నేతలు.. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారినట్లుగా మండిపడ్డారు. సీనియర్ లెక్చరర్లు.. ఎక్సైజ్ సీఐల ఉద్యోగ కాలం పొడిగింపుజీవోల జారీ చేయటాన్ని ఆయన తప్పు పట్టారు. తమకు అనుకూలమైన వ్యక్తులకు మేలు కలిగించేలా ప్రభుత్వం జీవోల్ని జారీ చేస్తుందన్నారు.

జీవోలు బయటకు వచ్చినవి కొన్ని అయితే.. చాలావరకూ రహస్యంగానే ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహస్యంగా జారీ చేస్తున్న జీవోలకు లెక్క లేదన్న ఆయన.. మరిన్నిజీవోలు జారీ చేయటానికి రంగం సిద్ధం చేసినట్లుగా ఆరోపించారు. ఈ తరహా మోసాలపై ఉద్యోగ సంఘాలు ఆలోచించాలన్నారు.

ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే డాక్టర్లకు సోకిందని.. వైద్యులకు పీపీఈ కిట్లు.. మాస్కులు పంపిణీ చేయటంలో ప్రభుత్వం వ్యవహరించిన నిర్లక్ష్యమే తాజా పరిస్థితికి కారణమని బండి సంజయ్ మండిపడుతున్నారు. అయితే.. ఆయన వ్యాఖ్యల్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ తప్పు పడుతున్నారు. ప్రభుత్వ వైద్యుల రక్షణ విషయంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.