పోలవరం టెండర్లను రద్దు చేసిన జగన్ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇస్తుందా..? ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహంతో ఉందా..? ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తప్పదా..? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిననున్నాయా..? అంటే తాజా పరిస్థితులు మాత్రం ఔననే అంటున్నాయి. పోలవరం.. ఏపీకి జీవనాడిగా ఈ ప్రాజెక్టును ప్రజలు భావిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంతమేరకు పనులు జరిగాయి.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపుగా 90 శాతం నిధులను కేంద్రం, పదిశాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి.. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే.. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికితీస్తామంటూ పదేపదే చెబుతున్నారు. అందులో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఒక్కసారిగా.. పోలవరం ప్రాజెక్టు టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. దీనిపై లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లేవనెత్తిన అంశానికి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆలోచనలో పడేసింది. అసలు ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పరిస్థితి ఏమిటి..? అన్న అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్రభుత్వం ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తుందో లోక్‌సభలో మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ చేసిన వ్యాఖలే ఇందుకు నిదర్శనంగా భావించవచ్చు.
పోలవరం ప్రాజెక్టు టెండర్లను రద్దుచేయడం అత్యంత బాధాకరమైన విషయమని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. ప్రాజెక్టు నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇది ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా చెప్పడం కష్టమని మంత్రి సభలో పేర్కొన్నారు. మెజార్టీగా కేంద్రం నిధులతో చేపడుతున్న ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా కేంద్రంతో చర్చించాల్సిన అవసరం ఉందనే వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది. ఇలా ఏకపక్షంగా వ్యవహరిస్తే.. కేంద్రం నిధులు ఎలా ఇస్తుందని ప్రజులు అనుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేంద్రం కూడా ఇక నుంచి సీరియస్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయని, ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కూడా కేటాయించడం కష్టమేననే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతిని రాజకీయ రంగు పులుముకుంటే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకం అవుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై ఉన్న కోపంతో ముఖ్యమంత్రి జగన్ ఇలా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, వాస్తవ పరిస్థితులపై కేంద్రంతో చర్చించి, సానుకూల వాతావరణంలో ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసే దిశగా కదలాలని సూచిస్తున్నారు.
తమ కనుసన్నల్లో ఉంటాడని భావించిన జగన్... తమ శత్రువు కేసీఆర్ తో చేరడం, చెప్పినా వినకపోవడం, కేంద్రం లిఖిత పూర్వకంగా వద్దన్న విషయాలపై ముందుకు వెళ్లడంతో జగన్ కు కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు సంకేతాలు వెలువడుతున్నారు. సెర్బియా లో నిమ్మగడ్డ అరెస్టు విషయం ముందే కేంద్రానికి తెలిసినా.. జగన్ కు సమాచారం ఇవ్వకపోవడం ఇందులో భాగమే.