ఢిల్లీ కథ : బీజేపీ ఓడినా సేఫ్, ఎలా?

August 14, 2020

ఢిల్లీ పీఠాన్ని మళ్లీ కేజ్రీవాల్ దక్కించుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కొట్టింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిజం చేస్తూ 70 అసెంబ్లీ స్థానాలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లు గెలుచుకుంది. 2015లో 3 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ ఈసారి 8 మాత్రమే గెలుచుకోగలిగింది. రెండున్నర దశాబ్దాలుగా ఢిల్లీ పీఠానికి బీజేపీ దూరంగా ఉంది. గత మూడు పర్యాయాలుగా బీజేపీ ఢిల్లీ పీఠం కలను చీపురు ఊడ్చేస్తోంది.  ఢిల్లీవాసులు కాంగ్రెస్‌ను పక్కకు పెట్టి కమలానికి దగ్గరయ్యే సమయంలో కేజ్రీవాల్ దూసుకువచ్చి పీఠాన్ని లాక్కున్నారు.

బీజేపీకి అధికారం దక్కకపోయినప్పటికీ ప్రతి ఎన్నికకు ఓటు బ్యాంకును నిలుపుకోవడం లేదా పెంచుకోవడం మాత్రం జరుగుతోంది. 2013లో అధికారం వచ్చినట్లే వచ్చి దూరమైంది. 2015లో కేవలం 3 సీట్లతో సరిపెట్టుకుంది. ఇప్పుడు 8 సీట్లకు పరిమితమైంది. బీజేపీ ఓటమి చెందినప్పటికీ గత రెండు పర్యాయాలుగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఆమ్ ఆద్మీ పార్టీకి మరలడం వల్లే కేజ్రీవాల్ గెలుస్తున్నట్లుగా ఓట్ల శాతాన్ని చూస్తే తేలిపోతుంది. బీజేపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరడం లేదు.

2013 ఎన్నికల్లో బీజేపీ 33.07 శాతం ఓట్లతో 31 సీట్లు గెలిచింది. మరో 5 సీట్లు గెలిస్తే పీఠం దక్కించుకునేది. నాడు ఆమ్ ఆద్మీ పార్టీ 29.49 శాతం ఓట్లతో 28 సీట్లు, కాంగ్రెస్ 24.55 శాతం ఓట్లతో 8 సీట్లు గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడే ఎన్నికల రణరంగంలోకి దిగింది. ఆ తర్వాత 2015, 2020 (ప్రస్తుతం) జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు షేర్ సింగిల్ డిపాజిట్‌కే పరిమితమైంది. కాంగ్రెస్ నష్టపోయిన ఓట్లు కేజ్రీ పార్టీ వైపు మళ్లాయి. బీజేపీ ఓటు బ్యాంకు యథాతథంగా ఉంది.

2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 32.2 శాతం ఓట్లను దక్కించుకుంది. కానీ గెలుచుకున్న సీట్లు మాత్రం మూడే. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఓటు బ్యాంకు కలిస్తే దాదాపు 55 శాతం వరకు ఉంటుంది. 2015కు వచ్చేసరికి అదే ఓటు బ్యాంకు (54.3 శాతం) ఆమ్ ఆద్మీ పార్టీ వశమైంది. కాంగ్రెస్ కేవలం 9.7 శాతం ఓట్లతో సీట్లు ఏమీ గెలుచుకోలేదు.

ఇక ప్రస్తుత ఫలితాల విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 2015 కంటే దాదాపు 1 శాతం ఓటు షేర్ తగ్గి 62 సీట్లు గెలుచుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ ఓట్ షేర్ గతంలో కంటే మరింత దిగజారి 4.26 శాతానికి పరిమితమైంది. అదే సమయంలో బీజేపీ ఓటు షేర్ 2013, 2015 కంటే దాదాపు 9 శాతం పెరిగింది.

2013లో మూడు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసి, కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు పోటాపోటీగా దక్కించుకోవడం, 2015లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏఏపీని చూడటం వల్ల కాంగ్రెస్ ఓటు కేజ్రీవైపు మళ్లడం అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు హఠాత్తుగా సింగిల్ డిపాజిట్‌కు పడిపోయి, అంతే మొత్తం ఏఏపీకి పెరగడం ఇక్కడ గమనించదగ్గ విషయం. 2020లోనూ అదే రిపీట్ అయింది. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ అంతర్గతంగా ఏఏపీతో చేతులు కలిపిందనే ఆరోపణలు కూడా ఉండటం వేరే విషయం. గత మూడు ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ ఓటు బ్యాంకు మళ్లడం లేదా కొంతమంది ఆరోపిస్తున్నట్లుగా కేజ్రీ పార్టీకి కాంగ్రెస్ పరోక్షంగా మద్దతివ్వడం వల్లే బీజేపీ అధికారానికి దూరంగా ఉంటోందని, కానీ ఓటు బ్యాంకు మాత్రం క్రమంగా పెంచుకుంటోందని చెబుతున్నారు.