జగన్ వ్యాఖ్యలపై బీజేపీ నేత సెటైర్లు..వైరల్

June 03, 2020

కరోనాను పారాసిటిమల్ తో చెక్ పెట్టవచ్చంటూ తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జగన్ వ్యాఖ్యలపై మెమేలు...సెటైర్లతో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. ఇక, జగన్ వ్యాఖ్యలపై జాతీయ మీడియాలోనూ జోకులు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ పై బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్‌ధర్‌ ట్విట్టర్లో సెటైర్లు వేశారు. ప్రపంచం మొత్తం కరోనా కల్లోలంతో అల్లాడుతుంటే...ఏపీ సీఎం జగన్‌ మాత్రం మరోలా మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా పరిష్కరించేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలు కృషిచేస్తోంటే....జగన్ మాత్రం 'కరోనా వస్తుంది, పోతుంది' అని లైట్ తీసుకున్నారని విమర్శలు గుప్పించారు.

బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉన్న జగన్...ఈ వైరస్‌ కు పారాసిటిమల్‌ సిఫార్సు చేస్తూ మీడియా ముందు ప్రకటన చేశారని దేవ్ ధర్ ఎద్దేవా చేశారు. అంతేకాదు....జగన్ వ్యాఖ్యలపై ఓ లుక్కేయాలంటూ...కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ ను కూడా ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. హర్షవర్థన్ దయచేసి ఈ విషయాన్ని గుర్తించాలని..ఇటువంటి హాస్యాస్పద వ్యాఖ్యలు, సూచనల నుంచి ఏపీ ప్రజలను కాపాడాలని కేంద్ర మంత్రి హర్ష వర్థన్ ను దేవ్ ధర్ రిక్వెస్ట్ కూడా చేశారు. దీంతోపాటు, 'పారాసిటిమల్' పై జగన్ వ్యాఖ్యలపై జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐలో వచ్చిన ఓ వార్తను కూడా దేవ్ ధర్ ట్వీట్ చేశారు. 'కరోనా' వైరస్‌కు పారాసిటిమల్‌ చక్కటి ఔషధం అని జగన్‌ అన్నట్లుగా ఏఎన్ఐ చెప్పిన విషయాన్ని దేవ్ ధర్ గుర్తు చేస్తూ షేర్ చేశారు. ఈ రకంగా ఏపీ సీఎం జగన్ ఇమేజి....జాతీయ స్థాయిలో డ్యామేజి అయిందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.