కేసీఆర్‌కు షాకిచ్చిన రావుగారు..

February 23, 2020

కొద్ది రోజుల కిందట తెలంగాణలో తెరలేచిన ఓ ఊహాగానం ఆ తరువాత తెరమరుగైనా ఇప్పుడు మళ్లీ ఓ కీలక నేత నోటి నుంచి రావడంతో టీఆరెస్ పెద్దల్లో టెన్షన్ మొదలైంది.  హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారనే ఊహాగానాలు ఆ మధ్య కొంతకాలం పాటు వినిపించినా.. అలాంటిదేమీ లేదని కేంద్రమంత్రులు వివరణ ఇవ్వడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. కానీ... ఇప్పుడు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నరు విద్యాసాగరరావు నోటి నుంచి దాదాపు అలాంటి మాటే వినిపించడంతో తెలంగాణలో ఒక్కసారిగా కలకలం రేగింది. ముఖ్యంగా టీఆరెస్, ఆ పార్టీ మిత్రపక్షం ఎంఐఎం నేతల్లో గుబులు మొదలైంది.
దిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోవడంతో, భారతరత్న, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్నట్టుగా హైదరాబాద్ నగరం రెండో రాజధాని అయ్యే అవకాశాలను తోసిపుచ్చలేమని విద్యాసాగరరావు అన్నారు. దిల్లీలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే... హైదరాబాద్ నగరం బహుశా రెండో రాజధాని కావొచ్చని ఆయన అన్నారు. గతంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పని చేసిన విద్యాసాగర్ రావు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాగా 2024 ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ అందుకోసం పెద్ద ఎత్తున కష్టపడుతోంది. అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. సీనియర్ లీడర్ కిషన్ రెడ్డికి కేంద్రంలో హోం శాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చింది. దాంతో బీజేపీలో ఒక ఊపు వచ్చింది. మరోవైపు సీనియర్ నేత విద్యాసాగరరావును కూడా గవర్నరు పదవి నుంచి రిలీవ్ చేసింది. దీంతో కిషన్ రెడ్డి, విద్యాసాగరరావులు ఇద్దరూ సీఎం కేండిడేట్లేనన్న మెసేజ్ తెలంగాణలో బలంగా దూసుకెళ్లింది. దీంతో తెలంగాణలో ప్రభావవంతమైన రెండు సామాజికవర్గాలను బీజేపీ ఆకట్టుకుంది.
పార్టీ అధిష్ఠానానికి తెలంగాణపై ఉన్న ఆకాంక్షలకు అనుగుణంగానే విద్యాసాగరరావు ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు సీనియర్ నేతగా, గవర్నరుగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తిగా పార్టీ అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ లేకుండా, వారికి తెలియకుండా ఇలాంటి కీలక వ్యాఖ్య చేసి ఉండరన్న వాదన వినిపిస్తోంది. విద్యాసాగరరావు మాటలను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని, మిగతా బీజేపీ నేతల్లా ఆయన ఏది పడితే అది మాట్లాడే పొజిషన్లో లేరన్న సంగతి కూడా టీఆరెస్ పెద్దలు సహా తెలంగాణలోకి నాయకులకు తెలిసిన విషయమే.
దీంతో ఏదో జరగబోతోందని.. హైదరాబాద్‌ను సెపరేట్ చేసి అటు టీఆరెస్, ఇటు ఎంఐఎం రెండింటి రెక్కలు విరిచేందుకు బీజేపీ స్కెచ్ వేసిందని భావిస్తున్నారు. త్వరలో కేసీఆర్ దిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.