బీజేపీ బాంబు పేల్చింది... జగన్ కు బ్యాండేనట

July 12, 2020

కేంద్రంలో వరుసగా రెండో పర్యాయం అధికారం దక్కించుకున్న బీజేపీ... దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. దక్షిణాదిలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలపై కమంల నేతలు మరింతగా దృష్టి పెట్టారనే చెప్పాలి. ఈ క్రమంలో అధికారంలో లేని పార్టీలకు చెందిన నేతలను లాగేస్తున్న కమల దళం... ఇప్పుడు ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీకి, ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా గట్టి షాకిచ్చేందుకు రంగం సిద్ధం చేసిందట. వచ్చే నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నద్దాలు ఏపీ పర్యటనకు వస్తున్నారు. ఈ క్రమంలో పలు పార్టీల నుంచి కీలక నేతలు బీజేపీలోకి చేరేందుకు కార్యరంగం సిద్ధమైపోయిందన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ మేరకు అమిత్ షా, నద్దాల సమక్షంలో ఏపీకి చెందిన పలు పార్టీలకు చెందిన కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని స్వయంగా బీజేపీ నేతలే చెబుతున్నారు. ఈ వార్తలు నిజంగానే ఇప్పుడు ఆసక్తికరంగా మారగా... ఇప్పుడు ఈ వార్తను మించిన మరో సంచలన వార్త బయటకు వచ్చింది. ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైపీసీ నుంచి కూడా బీజేపీలోకి వలసలు ఉంటాయన్నదే ఆ వార్త. 

వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు తమ పార్టీలోకి చేరబోతున్నారని బీజేపీ ఏపీ ఇంచార్జీ సునీల్ దేవ్ ధర్ శనివారం సంచలన వ్యాఖ్య చేశారు. అయితే బీజేపీలోకి చేరబోతున్న సదరు వైసీపీ నేతలు ఎవరన్న విషయాన్ని సునీల్ వెల్లడించలేదు గానీ... సునీల్ నోట నుంచి వచ్చి ఈ వార్త మాత్రం జగన్ కు పెద్ద షాకిచ్చిందని మాత్రం చెప్పక తప్పదు. గడచిన ఎన్నికల్లో `175 సీట్లలో ఏకంగా 151 సీట్లు గెలవడంతో జగన్ లో ఓ రేంజిలో ధీమా వ్యక్తమైంది. అయితే ఆ ధీమా ఎంతో కాలం కొనసాగదన్న కోణంలో ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలు మొదలయ్యాయి. అధికార పార్టీగా ఉన్న వైసీపీ నుంచే పలువురు కీలక నేతలు బీజేపీలోకి చేరితే... జగన్ కు బ్యాండే కదా. ఎన్నికల్లో పెద్ద విజయం సాధించి అప్పుడే ఐదు నెలలు కూడా కాకముందే... బీజేపీలోకి వలస వెళుతున్నారంటే... వైసీపీలో ఎలాంటి పరిస్థితి ఉందో ఇట్టే అర్థమైపోతోందన్న వాదనలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఓ వైపు బీజేపీతో స్నేహంగా మెలగుతున్న జగన్... ఇప్పుడు తన పార్టీకి చెందిన కీలక నేతలను బీజేపీ లాగేస్తే... ఆయనకు షాకింగే కదా. ఈ పరిణామం జగన్ కు కేవలం షాకింగేనని మాత్రమే చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే... 2024 ఎన్నికల్లో, లేదంటే అంతకంటే ముందుగానో ఎన్నికలు జరిగితే... ఏపీలో అధికారం చేపట్టే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ చాలా దూకుడుగా వ్యూహాలు అమలు చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ నుంచి కీలక నేతలు బీజేపీలోకి చేరితే... 2024 ఎన్నికల్లో జగన్ కు బిగ్ మైనస్ గానే మారుతుందన్న విశ్లేషణలు కూడా కొనసాగుతున్నాయి. చూద్దాం... మరి వచ్చే నెలలో బీజేపీలో చేరే వైసీపీ నేతలు జగన్ కు ఏ మేర షాకిస్తారో?