టీవీ9 రవి ప్రకాశ్ ఇష్యూ.. బీజేపీ ఎంటరైందా?

August 03, 2020

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీవీ 9 కేసులో రవి ప్రకాశ్ అజ్ఞాతం వీడడం.. పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావడం తెలిసిందే. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో బెయిలు పిటిషన్లు వేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యారు. అయితే... ఫోర్జరీ వంటి క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్ను పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు.. రవి ప్రకాశ్ ఏమాత్రం టెన్షన్ లేకుండా అంత నిర్భయంగా కనిపించడం వెనుక ఆంతర్యమేంటన్నవి ఇప్పుడు అంతటా చర్చనీయమవుతున్నాయి.
దీనికి కారణాలు తరచి చూస్తే ఎన్నో కోణాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ఠ్రాల్లో న్యూస్ చానల్ అంటే టీవీ నైనే అన్నట్లున్న పరిస్థితుల్లో దాన్ని కేసీఆర్ అనుకూల వ్యాపారవేత్త కొనుగోలు చేయడం.. ఆ తరువాత చానెల్ నుంచి రవి ప్రకాశ్ను సాగనంపేందుకు ఏర్పాట్లు చేయడం.. ఈ క్రమంలో జరిగిన రచ్చలో రవి ప్రకాశ్ వైపు నుంచీ కొన్ని పొరపాట్లు ఉండడం వంటివన్నీ ఈ ఎపిసోడ్‌లో కనిపిస్తున్నాయి.
అయితే.. ఇందులో ఇంకో కోణమూ ఉంది. టీవీ 9 వంటి పాపులర్ చానల్ కేసీఆర్ చేతికి రావడం ఒక ఎత్తయితే.. ఇప్పుడు రవి ప్రకాశ్‌కు కేసీఆర్‌ను మించిన నేతల అండదండలూ ఉణ్నాయన్నది మరో కోణం. ఆ అండదండలు లభించాకే ఆయన నిర్భయంగా పోలీసుల ముందుకొచ్చారని.. ఆ సంగతి అర్థమయ్యే పోలీసులూ ఆయన్ను ప్రశ్నించి వదిలిపెట్టారని తెలుస్తోంది.
ఈ గొడవంతా బయటకు రావడానికి ముందు ఇటీవల టీవీ9 జాతీయస్థాయి మీడియాగా విస్తరించినప్పుడు ఆ లాంచింగ్ కార్యక్రమానికి ప్రధాని మోదీ వచ్చారు. ఆ కార్యక్రమంలో మోదీతో పాటు రవిప్రకాశ్ కనిపించారు. ఆయనకు జాతీయ స్థాయి నేతలతో మంచి సంబంధాలున్నాయని గతంలోనూ అనేకసార్లు రుజువైంది.
ఈ నేపథ్యంలో ఆయన తన పరిచయాలను ఉపయోగించి కేంద్రం సాయం కోరారని.. అందులో భాగంగానే కోర్టుల నుంచి అనుకూలత రానప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం నుంచి అరెస్ట్ థ్రెట్ ఉన్నప్పటికీ నిర్భయంగా పోలీసుల ముందుకొచ్చారని తెలుస్తోంది. ఈ పరిణామలన్నీ నిశితంగా గమనించిన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ రాష్ట్ర పోలీసు శాఖను నిలువరించినట్లు సమాచారం.
అయితే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడెందుకు ఆసక్తి అన్న ప్రశ్న కూడా కీలకమే. కానీ, దానికి విశ్లేషకులు చెబుతున్న సమాధానం కూడా ఆమోదయోగ్యంగానే ఉంది. బీజేపీ తెలంగాణలో విజయావకాశాలు వెతుక్కుంటున్న వేళ రవిప్రకాశ్ వంటి మీడియా కింగ్ చేతిలో ఉంటే అవసరమైతే ఇంకో చానల్ పెట్టించి బీజేపీ గళం వినిపించొచ్చన్నది ఆ పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. మొత్తానికి బీజేపీ, రవి ప్రకాశ్ పరస్పర అవసరాలు ఈ ఇష్యూకి ఒక పరిష్కారం ఇస్తాయని భావిస్తున్నారు.