ఢిల్లీలో కాళ్లు..తెలంగాణ‌లో క‌న్నీళ్లు...ఇదే వారి స్టైల్‌

February 24, 2020

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ నేప‌థ్యంలో..మ‌రోమారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణ రాష్ట్రంలో ప‌రిపాలిస్తున్న టీఆర్ఎస్ మ‌ధ్య మాట‌ల యుద్ధం జోరుగా సాగుతోంది. బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రం ఏం కేటాయించింద‌ని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించిన నేప‌థ్యంలో...బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ స్పందిస్తూ...కేటీఆర్ ను “తెలంగాణ నయా గజిని” గా అభివర్ణించారు. నయా గజిని .‌. కేంద్ర సాయాన్ని మర్చిపోవటం సాధారణమేనని చెప్పారు. హైద్రాబాద్ రోడ్లను బాగుచేయలేని వ్య‌క్తి కేంద్రంపై విమర్శలు చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు చేసిన సాయంపై మంత్రి కేటీఆర్ తో చర్చకు సిద్ధమని స‌వాల్ విసిరారు.
నీటి ప్రాజెక్టులకు కేంద్రమిచ్చిన  అనుమతుల గురించి తన బావ హరీష్ రావును అడిగి కేటీఆర్  వివ‌రాలు తెలుసుకోవాలని సూచించారు. తమ‌ అవినీతి బయటపడుతుందనే.. కాళేశ్వరం ప్రాజక్ట్ డీపీఆర్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం  కేంద్రానికి ఇవ్వటం లేదని విమర్శించారు . డీపీఆర్ ఇవ్వకుండా.. పోలవరానికి జాతీయహోదా ఎలా సాధ్యమవుతుందని లక్ష్మణ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆదాయ వనరులు పెంచుకోకుండా.. కేంద్రం మీద నెపం వేయటం చేతకాని తనం అవుతుందని, కేంద్ర పథకాలకు పేరు మార్చి ప్రచారం చేసుకుంటోన్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా.. అప్పటి ఏపీకి ఎన్ని నిధులిచ్చారో కేటీఆర్ చెప్పాలి? అని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాళ్ళు.. తెలంగాణలో కన్నీళ్ళు తెలంగాణ గజనీకి అలవాటేనని లక్ష్మ‌ణ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.
నిజామాబాద్ మేయర్ ‌‌సహా..  తుక్కుగూడ, నేరేచుచర్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో టీఆర్ఎస్ నిజాయతీ ఏపాటిదో తేలిపోయిందని ల‌క్ష్మ‌ణ్ అన్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓటువేసిన టీఆర్ఎస్ ఎంపీ కేకే ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడన్న విషయం‌ తెలంగాణ గజినికి(కేటీఆర్ కు) గుర్తులేదని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో స్వతంత్య్ర‌ అభ్యర్థులను గుంజుకున్న చరిత్ర కేటీఆర్ ది అని, రాజ్యసభ్యుడితో దొంగ ఓటు వేయించటం టీఆర్ఎస్ కే చెల్లిందని అన్నారు.