క్రికెటర్లకు బీజేపీ గాలం.. ఊహించని షాక్!

August 06, 2020

గతవారం దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. లోక్ సభ స్థానాల విషయంలో పార్టీలన్నీ వ్యూహరచనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ బీజేపీ సరి కొత్తగా స్కెచ్ వేసింది. సాధారణంగా మోడీ వేసి ఎత్తుగడలే వేరు! వ్యూహరచన చేయడం, దాన్ని ఎవ్వరికీ తెలియకుండా రాత్రికి రాత్రే తెరపైకి తీసుకురావడం ఆయనకు అలవాటు. ఈ కోణంలోనే ఆయన లోక్ సభ స్థానాల విషయంలో భారత స్టార్ క్రికెటర్లకు గాలం వేయబోయారు. కానీ అది బెడిసి కొట్టిందని సమాచారం.

ముఖ్యంగా దేశరాజధాని న్యూఢిల్లీపై కన్నేసిన బీజేపీ మొత్తం స్థానాలను గెలిచేందుకు గాను బాగా పేరున్న సెలెబ్రిటీలను దించాలని చూస్తోంది. అందులో భాగంగానే వెస్ట్ ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ను బరిలోకి దించాలని ఆయనతో చర్చలు జరిపారట బీజేపీ నేతలు. కానీ బీజేపీ ప్రతిపాదనకు సెహ్వాగ్ సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తోంది. కొన్ని కారణాల వల్ల తాను పోటీచేయలేనని తెగేసి చెప్పాడట సెహ్వాగ్. ఆయన సోదరి ప్రస్తుతం వెస్ట్ ఢిల్లీలో బీజేపీ కౌన్సిలర్ గా ఉన్నారు. ఆమె ద్వారా సంప్రదించగా నో చెప్పినట్లు సమాచారం అందుతోంది. అయితే సెహ్వాగ్ నో చెప్పడంతో మరో క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు బీజేపీ గాలం వేసింది. ఆయన అంగీకరిస్తే న్యూఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దింపుతామని చెప్పారట బీజేపీ పెద్దలు. కానీ గంభీర్ కూడా ఏ విషయం తేల్చలేదట. దీంతో గంభీర్ తోపాటు మౌనికా అరోరా పేరును కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

మొత్తం ఢిల్లీ పరిధిలో 7 లోక్ సభ సీట్లున్నాయి. వీటికి గాను ఢిల్లీలో మే 12వ తేదీన లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఈ స్థానాలు ఎలాగైనా కైవసం చేసుకోవాలని, వీటిపై కన్నేసిన బీజేపీ ప్రముఖులను బరిలోకి దించాలని యోచిస్తోంది. కానీ బీజేపీ షాకిస్తూ క్రికెటర్లు నో చెప్పడం దేశంలో హాట్ టాపిక్ అవుతోంది. బీజేపీ సిద్ధాంతాలు నచ్చక వారు నో చెప్పారా? లేక మరేవైనా కారణాలున్నాయా? అనే కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి.