జగన్ యాక్షన్ బీజేపీకి అర్థమైందా?

October 18, 2019

జగన్ సన్నాయి నొక్కులను బీజేపీ గ్రహించింది. మెల్లగా హెచ్చరించడం మొదలుపెట్టింది. ప్రతివిషయంపై జగన్ అవగాహన లేకుండా స్పందిస్తున్నారని అర్థం చేసుకున్న బీజేపీ ఈరోజు రెండు విషయాల్లో జగన్ కి ఝలక్ ఇచ్చింది. ఒకటి మోడీ నుంచి, ఇంకోటి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ నుంచి వచ్చింది.

గత ప్రభుత్వం సవరించి ఖరారుచేసిన అంచనాలను ఈ జనవరిలోనే కేంద్రం అంగీకరించింది. వాటిని రాజ్యసభలో నిన్న ఓ ప్రశ్నకు సమాధానంగా లిఖితపూర్వకంగా తెలిపింది. అయితే, జగన్ సర్కారు కొత్త అంచనాలు తయారుచేసి కేంద్రానికి పంపగా... కేంద్రం అంగీకరించలేదు. ఈ అంచనాలకు రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ అభ్యంతరం చెప్పింది. దీనిపై మరిన్ని వివరాలు ఇవ్వాలంటూ కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఏపీని కోరింది. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఏపీసర్కారుకు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.

మరోవైపు అక్రమ కట్టడాల కూల్చివేతను ఒక పాలసీలా భావించి ముందుకు వెళితే మద్దతు ఇస్తాం. కానీ కక్ష సాధింపు కోసం కేవలం ప్రజావేదికను కూల్చేస్తామంటే అంగీకరించే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ప్రజావేదికను కూలిస్తే చంద్రబాబుకు, జగన్ కు తేడా ఏం ఉండదని ఇద్దరూ ఒకటే అవుతారని అన్నారు. 8 కోట్ల విలువైన భవనాన్ని కాలువలో పడేయకుండా ప్రజల అవసరాల కోసం ఉపయోగిస్తే మంచిది అన్నారు. లేదా రాష్ట్రంలో ఎక్కడ అక్రమకట్టడాలు ఉన్నా కూల్చేయాలన్నారు. మా పార్టీ వాళ్లదయినా పాలసీ ప్రకారం పోతే మాకు అభ్యంతరం లేదన్నట్లు ఆయన మాట్లాడారు. మొత్తానికి వ్యవస్థలను అర్థం చేసుకోకుండా తన రాజకీయ లబ్ధి ముఖ్యమన్నట్లు జగన్ ప్రవర్తిస్తున్న తీరును బీజేపీ గ్రహించినట్లు వీటిని బట్టి అర్థమవుతోంది. 

అయితే, ప్రజావేదిక కూల్చివేతపై ఇంత వ్యతిరేకత వస్తుందని జగన్ ఊహించలేదట. ఇపుడు దీనిపై కొంచెం ఆందోళన ఉన్నా ప్రజావేదిక కూల్చివేత విషయంలో వెనక్కు తగ్గితే అది తన నిర్ణయశక్తిపై ఒక పెద్ద మచ్చగా మిగిలిపోతుందని భావిస్తున్న జగన్... ఎవరేమన్నా దాని కూల్చడమే తనకు మంచిదని డిసైడైనట్లు తెలుస్తోంది. ఆర్నెల్లలో ప్రజల ముఖ్యమంత్రి అనిపించుకుంటాను అని కేవలం నెలరోజుల్లోనే జగన్ వివాదాస్పద ముఖ్యమంత్రిగా మారిపోయారు.