​గోదావరిలో భారీ బోటు ప్రమాదం - లేటెస్ట్ అప్ డేట్స్ ఇవే

July 01, 2020

తెలుగు రాష్ట్రాలకు ఈరోజు విషాదంతో ముగిసింది.  తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు - కచ్చలూరు మధ్య 60 మందికి పైగా ప్రయాణికులతో బయలుదేరిన బోటు గోదావరిలో మునిగిపోయింది. అత్యధికులు గల్లంతయ్యారు. ప్రస్తుతానికి 15 మంది మృతదేహాలు దొరికాయి. ఎవరైనా బతికున్నారా లేదా అనే విషయాలు పూర్తిగా తెలియ రాలేదు. మొత్తానికి చరిత్రలో ఇది మూడో అతిపెద్ద ప్రమాదంగా నమోదైంది. ఇందులో రెండు రాష్ట్రాలకు చెందిన వారూ ఉన్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మునిగిపోయిన బోటులో 50 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫుల్ అప్ డేట్స్ ఇవే

1. 1960 ఏడాదిలో  ఉదయభాస్కర్‌ అనే బోటు మునిగిపోవడంతో 60 మంది చనిపోయారు. తర్వాత ఝాన్సీరాణి అనే మరో బోటు మునిగిపోయి 8 మంది చనిపోయారు. తాజాగా ఈరోజు ప్రమాదం జరిగింది. ఎంత మంది మరణించారో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 
2. కచులూరు మందం అనే ప్రాంతంలో బోటు ఎగువవైపునకు వెళ్లే చోట బలమైన రాయి ఉందని, దానిని బోట్లు తాకినపుడు ఈ ప్రమాదాలు జరుగుతాయని స్థానికులు చెబుతున్నారు. ఇదే ప్రాంతంలో మూడు ప్రమాదాలు జరిగాయి. 
3. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం... పడవ ఓ పక్కకి మెల్లగా ఒరిగింది. దీంతో కొందరు బయటకు దూకేశారు. కొద్దిసేపటి తర్వాత పూర్తిగా బోర్లాపడింది. దీంతో కొందరు బయటకు దూకి పడవ పైకి ఎక్కారు. సుమారు 20, 30 మంది వరకు పైకి ఎక్కాం. కానీ, కొద్దిసేపటికే పడవ మళ్లీ తిరగబడింది. దీంతో అందరం నీళ్లలో పడ్డాం. అదే సమయంలో మరో పడవ రావడంతో మేం ప్రాణాలతో బయటపడ్డాం. 
4. వరంగల్ జిల్లా నుంచి 14 మంది రాగా ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు.9 మంది గల్లంతయ్యారు.
5. ప్రస్తుతానికి మొత్తం 27 మంది ఇందులో ప్రాణాలతో బయట పడగా... 12 మంది మృతదేహాలు దొరికాయి. మిగతా వాళ్ల ఆచూకీ తెలియాల్సి ఉంది. 
6. వెంటనే అన్ని సర్వీసు బోట్లు ఆపూేయాలని... భద్రతతో కూడా పాలసీ రూపొందించే వరకు ఏ బోటు తిప్పవద్దని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు.
7. ప్రమాదానికి గురయిన రాయల వశిష్ఠ బోటుకు ఎలాంటి అనుమతులు లేవని పర్యాటక మంత్రి వెల్లడించారు.
8. మృతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ప్రమాద పరిహారం ప్రకటించింది. 
9. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమాదంపై స్పందిస్తూ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని కార్యకర్తలకు ఆదేశించారు.
10. దీనిపై మోడీ తెలుగులో ట్వీట్ చేశారు. ప్రమాద బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. ఇది ఇది చాలా బాధాకరమైన ఘటన. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి అంటూ మోడీ ట్వీట్ చేశారు. కానీ ఏ సాయం ప్రకటించకపోవడం గమనార్హం.​